YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగల నిర్వహణ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగల నిర్వహణ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు, 20 
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో ప్రజలు ఒకే చోట గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో కూడా జనం ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉన్న సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, బార్లు, పబ్బులు, క్లబ్బుల లాంటి వాటిని మూసేయడం జరిగింది. పాఠశాలలు, కళాశాలలు, క్రీడా మైదానాలు, పార్కులను కూడా తెరవడం లేదు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడడమే అతి ముఖ్యం కాబట్టి సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటి పైనా నియంత్రణ కొనసాగుతున్నది. కరోనా వైరస్ పై పోరాడడంలో భాగంగా సామూహిక ఉత్సవాలకు అనుమతి ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలు ఇచ్చింది. అందులో భాగంగా గత మార్చి 16 నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ఎవరిళ్లలో వారే నిర్వహించుకుంటున్నారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, జగ్నే కీ రాత్, బోనాలు, బక్రీద్ తదితర పండుగలు సామూహికంగా కాక ఎవరిళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రభుత్వ పరంగా జరిపే స్వాతంత్ర్య దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చాలా నిరాడంబరంగా, చాలా తక్కువ మందితో జరిగింది. ఈ నెలలో జరిగే వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రంను కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని మతాల పండుగలను, ఉత్సవాలను ఏ విధంగానైతే ఎవరిళ్లలో వారు జరుపుకుని, కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించారో వినాయక చవితి, మొహర్రం విషయంలో కూడా అదే స్పూర్తి కొనసాగించాలని కోరుతున్నాను. ఎవరిళ్లలో వారే వినాయకుడికి పూజలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సామూహిక ప్రార్థనలు, ఊరేగింపుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విన్నవించుకుంటున్నాను. కోవిడ్ నిబంధనల కారణంగా సామూహికంగా వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం నిర్వహించుకోవడానికి, ఊరేగింపులు జరపడానికి, నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం  కుదరదు. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని, ఎవరిళ్లలో వారు ఉత్సవాలు, పండుగలు, మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకుని సహకరించగలరని సవినయంగా కోరుతున్నాను.
=

Related Posts