విశాఖపట్నం ఆగస్టు 20
వైఎస్ విజయమ్మను ఓడించినందుకే విశాఖకు హుద్ హుద్ వచ్చిందని బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న చరిత్ర వైసీపీ నేతలది. విశాఖ విధ్వంసానికి కుట్ర పన్నిన వైసీపీ నేతలకు ఉత్తరాంధ్ర ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమే గుడివాడ అమర్ నాథ్ లాంటి నేతలు నోరుపారేసుకుంటున్నారని టీడీపీ మహిళా విభాగం నేత వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టేందుకు సిద్ధంగా ఉండండి. తెల్లారి లేచింది మొదలు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై అసత్యాలు ప్రచారం చేయడం తప్పించి అధికార పార్టీ నేతలకు మరొక పనిలేనట్టుంది. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ మకిలిని ఇతరులకూ అంటించాలని చూస్తోంది. కరోనా విలయతాండం చేస్తుంటే ముఖ్యమంత్రి అయి ఉండీ ఇంతవరకూ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించలేదు? కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ చంద్రబాబు నాయుడు తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చేస్తోన్నది ఏమిటి? తాడేపల్లి రాజప్రసాదం దాటకుండా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర మీ నాయకుడిదే. అమరావతి పేరుతో తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడిందని వైసీపీ నేతలు గొంతు చించుకుని ప్రచారం చేశారు కదా.. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. విచారణలు, కమిటీలు అంటూ హడావుడి చేసి చివరకు ఏం తేల్చారు? చేసిన ఆరోపణలను నిరూపించలేక చతికిలపడ్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారు. సగానికి పైగా నిర్మాణాలు పూర్తయి సకల హంగులతో సిద్ధంగా ఉన్న రాజధానిని కాదని మీ స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది వాస్తవం కాదా? అమరావతిలో భవనాలు గ్రాఫిక్స్ అని విష ప్రచారం చేసిన అధికార పార్టీ నేతలు వాటిపై నుంచి దూకేందుకు సిద్ధమా అంటే మొహమెందుకు చాటేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
విశాఖను హుద్ హుద్ కకావికలం చేసినప్పుడు, తిత్లీ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర విలవిలలాడినప్పుడు వైసీపీ నేతలంతా ఏ కలుగులో దాక్కున్నారు? విశాఖ చుట్టుపక్కల వేల ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని కాపాడుకునేందుకు రాజధాని ముసుగు తొడిగింది మీరు కాదా? విశాఖను అభివృద్ధి చేసింది చంద్రబాబే. తెలుగుదేశం హయాంలోనే విశాఖ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంది. చంద్రబాబు దూరదృష్టితో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల వల్లే ప్రముఖ కంపెనీలు విశాఖకు క్యూ కట్టాయి. వైసీపీ నేతలు భూ దాహంతో ఆ పరిశ్రమలను వెళ్లగొట్టారు. వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలను తరిమికొట్టారు. విశాఖ గురించి మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు. చేసిన పనులు తప్పని కోర్టులు చివాట్లు పెడితే సరిదిద్దుకోకపోగా ఏకంగా జడ్జిల ఫోన్లనే ట్యాపింగ్ చేశారంటే మీరెంతటి ఘనులో అర్ధమవుతోంది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ పెద్దలు బుకాయించే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. హోంమంత్రి సుచరిత ఫోన్ ట్యాపింగ్ ను అత్యాచారంతో పోల్చడం దుర్మార్గం. తప్పుడు పనులు చేసి రాష్ట్రాభివృద్ధి గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యలు వేదాలు వల్లించినట్టుంది. మీకు ఏమాత్రం సరిపోని విషయాల జోలికి వెళ్లకండి. అమరావతి, విశాఖ మాత్రమే కాదు 13 జిల్లాలూ తెలుగుదేశం హయాంలోనే అభివృద్ది పథంలో నడిచాయన్నది సుస్పష్టం. ఇవాళ 151 సీట్లు ఉన్నాయి కదా అని నోటికి అడ్డూ అదుపూ లేకుండా వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు