ఎమ్మిగనూరు ఆగష్టు 20
కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా లాక్డౌన్ నుంచి ఇంకెప్పుడు బయటపడతామనే ముచ్చట్లే.. వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ ఏప్రిల్ నెల నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఏ సంస్థలోనూ కార్యకలాపాలు కొనసాగకపోవడంతో.. వాటికి నయా పైసా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటిదకా మార్చి నెల వేతనాలతోనే ఎలాగోలా సర్ధుకున్న కుటుంబాలు.. మే ఒకటో తేదీ నుంచి ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పట్టణంలోని మాచానిసోమప్ప ఇం.మీ స్కూల్ ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం వారిని కలవరపెడుతోంది.
కరోనాలోనూ గుదిబండ..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కిరాణం, మెడికల్ మినహా ఇతర లావాదేవీలు కొనసాగడం లేదు. ఇంటి అద్దెలకు ఇబ్బంది పెట్టవద్దని అద్దె ఇంటి యజమానులకు సూచించింది. కుటుంబ పోషణ సైతం భారంగా మారిన ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ప్రయివేటు విద్యాలయాలు వ్యాపార ధోరణిని వీడటం లేదు. పట్టణంలో ఉన్న మాచానిసోమప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీజులు చెల్లించాలని అడుగుతుండడంతో, లాక్డౌన్ కారణంగా ఉద్యోగం లేక, జీతం వస్తదో.. రాదో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనూ ఈ ఫీజుల భారాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
స్కూల్ విద్యార్థులకు డ్రైరేషన్
కరోనా ప్రభావంతో పాఠశాలలు తెరవనందున మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన బదులు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పాఠశాలలు మూసివేసిన దృష్ట్యా గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా వీటి పంపిణీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. కానీ ఈ పాఠశాలలో పాఠశాల సిబ్బందే పేరెంట్స్ కు ఫోన్ చేసి ఫీజులు కట్టి డ్రై రేషన్ తీసుకెళ్లాలని చెప్పడం గమనార్హం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కిలో బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు. జూన్ 12 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సెలవు రోజులను మినహాయించి మిగిలిన 62 రోజులకు ప్రాథమిక విద్యార్థులకు 6.2 కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 9.3 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని, ప్రతి విద్యార్థికి రెండు విడతలుగా 56 కోడిగుడ్లు, 35 చెక్కీలు పంపిణీ చేయాలని ఐదో తరగతి విద్యార్థులను ఆరో తరగతికి ప్రమోట్ చేసినందున వారికి ఉన్నత పాఠశాల విద్యార్థుల మాదిరిగానే బియ్యం ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం తెలిపింది. అయినా పాఠశాల సిబ్బంది ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ పేరెంట్స్ ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కరోనా ప్రభావంతో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవ్వడంతో ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయో గ్యారంటీ లేదు. దేశమంతా లాక్డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పరిస్థితిలో ప్రయివేటు విద్యా సంస్థలు.. ఫీజుల గురించి మాట్లాడటం దుర్మార్గం. ఫీజులను వసూలు చేసుకునేందుకే విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేస్తున్నామని పేరెంట్స్ వచ్చి ఫీజు చెల్లించి బియ్యం, చిక్కీ, గుడ్లు లను తీసుకెళ్లాలని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా వాటిని పాటించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఆలంబనగా చేసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు రెచ్చిపోతున్నాయి. టీచర్లకు వేతనాలు, మౌలిక వసతుల కల్పన తదితర పేర్లతో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లు పేదలు, మిడిల్ క్లాస్ కుటుంబాల్లోని పిల్లలకు ప్రైవేట్ విద్య ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ వాటి అమలును మాత్రం గాలికొదిలేసింది. ఏటా సెప్టెంబరు మాసం చివరికల్లా ప్రతి ప్రైవేట్ స్కూల్ విధిగా తమ జమా ఖర్చులను తెలిపే డాంక్యూమెంట్స్ ఆడిట్కు సమర్పించాల్సి ఉంటుంది. మరో 10 రోజుల్లో అకడమిక్ ఇయర్ పున:ప్రారంభమవుతుంది. ఈ దశలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికీ తమ జమా ఖర్చు లెక్కలను ఆడిట్ చేయించలేదు. ఇటీవల మాచానిసోమప్ప ఇం.మీ పాఠశాలల్లో భారీగా వసూళ్లు చేస్తున్న ఫీజుల భారాన్ని తట్లుకోలేక కడుపు మండిన పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులను వసూలు చేస్తున్న స్కూల్ పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు జీతాలు లేకా కుటుంబ నిర్వహణే అతికష్టంగా మారడంతో పరిస్థితులు కడు దయనీయంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఫీజుల కోసం ప్రయివేటు విద్యాలయాలు చేస్తున్న జులం ఎంత వరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.మా పరిస్థితులు బాగుంటే భవిష్యత్తులో మేమే ఫీజులు చెల్లిస్తాం.అంతవరకు ఫీజులు చెల్లించం. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.