కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి రోజు రోజుకు కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు తెలుగు, మరోవైపు తమిళులు దెబ్బకొట్టేస్తారేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, బీజేపీకి ఓటు వేయవద్దని ఇప్పటికే ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలుగు ఓటర్లకు పిలుపు నిచ్చారు. ఏపీకి మోసం చేసిన బీజేపీని తరిమేయాలని కోరారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకడుగు ముందుకేసి జేడీఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇలా తెలుగు ఓటర్లు బీజేపీకి చేరువ కాకుండా ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ హోరా హోరీ పోరాడుతున్నాయి. జనతాదళ్ ఎస్ ప్రభావం కూడా కొంత మేర కన్పిస్తుండటంతో తక్కువ ఓట్లతోనే గెలుపోటములు ఉంటాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఓటర్ల ప్రభావం కన్నడ ఎన్నికల్లో చూపుతుందంటున్నారు.ఇక తమిళనాడులో కావేరీ బోర్డు వివాదం అలానే ఉంది. సుప్రీంకోర్టు చెప్పినా కావేరిజలాల బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై తమిళ ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల చెన్నైకి వచ్చిన ప్రధాని మోడీ ఎదుట కూడా తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు. మొన్నటివరకూ పార్లమెంటు ను స్థంభింప చేసిన తమిళ ఎంపీలు ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళనకు దిగారు. సినీ పరిశ్రమ నుంచి అన్ని వర్గాల మద్దతు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆందోళనకు దొరికింది. కర్ణాటకలో దాదాపు 30 నియోజకవర్గాల్లో తమిళుల ప్రభావం ఉంటుందన్నారు. వీరు కూడా బీజేపీకి ఓటేసే పరిస్థిితి లేదంటున్నారు. ఇలా ఇటు తమిళ తంబిలు….తెలుగు తమ్ముళ్లు బీజేపీకి దూరమై కొంపమునుగుతుందేమోనన్న ఆందోళన కమలనాధుల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అయితే ఇందుకోసం బీజేపీ తెలుగు, తమిళ నేతలను ప్రచారంలోకి దించే ప్రయత్నం చేస్తుంది.మరి ఎంతవరకూ విజయం సాధిస్తుందో చూడాలి.