YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*భాద్రపద మాసం విశిష్టత ఏమిటి*

*భాద్రపద మాసం విశిష్టత ఏమిటి*

శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.
              ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.
                తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.
                పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.
              భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా _గుర్తుంచుకోదగ్గవే_ !
            ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
*ఓం శ్రీ మాత్రే నమః*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts