YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు పథకంలో తప్పుడు చెక్కులు

రైతు బంధు పథకంలో తప్పుడు చెక్కులు

రైతు బంధు పథకానికి  చెక్కుల్లో తప్పులు తడకలు దొర్లుతున్నాయి. ప్రభుత్వం తొలి విడతలో ఏప్రిల్ 20వ తేదీ  నుంచి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.  చెక్కుల ముద్రణను ఎనిమిది బ్యాంకులకు అప్పగించింది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పూర్తి వివరాలను రైతులు ఇప్పటివరకు తెలుసుకునే అవకాశం లేకపోయింది. రైతులకు ఉన్న భూవిస్తీర్ణం ఆధారంగా పెట్టుబడి పథకం చెక్కుల్లో నగదును నమోదు చేస్తారు. దీంతో రైతుల చేతికి ఇప్పటివరకు పాసుపుస్తకాలు రాకపోయినా, చెక్కులో ఉన్న నగదు ఆధారంగా వారి పేరు మీద ఎంత భూమి ఉందో తెలిసిపోతుంది. ఈ వివరాలు ఏమాత్రం తేడాగా ఉన్న రైతులు ఆందోళన చేసే అవకాశం ఉంది. 23.16 లక్షల చెక్కుల్లో 36 వేల చెక్కుల్లో తప్పులున్నట్లు ఇప్పటికై అధికారులు గుర్తించారు. ఇక 55 లక్షల చెక్కుల్లో ఎన్ని తప్పులు ఉంటాయోనని వ్యవసాయ, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల చేతికి చెక్కుల అందేసరికి లోపాల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు.రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా చెక్కులను ముద్రిస్తున్నప్పటికీ.. చాలా వాటిలో చెక్కుల్లో తప్పులు దొర్లుతున్నాయి. చెక్కుల ముద్రణకు రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతుల వివరాలను ఎనిమిది బ్యాంకులకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు అందించాయి. వీటి ఆధారంగా ఆయా బ్యాంకులు చెక్కులు ముద్రిస్తున్నాయి. అయితే బ్యాంకులకు రైతుల వివరాలు అందించే సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఆ వివరాలను ఒకటికి రెండు సార్లు సరి చూసుకునే అవకాశం లేకపోయింది. దీంతో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఆధారంగా తమ వద్ద ఉన్న వివరాలను బ్యాంకులకు అందజేశారు. క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, ఏఈఓలు రికార్డుల ప్రక్షాళన పాల్గొన్నారు. వీరిలో కొందరు  ఆ సమయంలో వారికి అందుబాటులో ఉన్న వివరాలను నింపేశారు. ఫలితంగా కొంతమంది రైతుల ఖాతాల వివరాల్లో గందరగోళం ఏర్పడింది. వీటిని ఉన్నతాధి కారులు పరిశీలించకుండా సమాచారాన్ని బ్యాంకులకు అందించారు. ఆయా శాఖల నుంచి వచ్చిన వివరాల మేరకు ఇప్పటివరకు 23.16 లక్షల చెక్కులను ఆయా బ్యాంకులు ముద్రించాయి. వీటిల్లో దాదాపు 36 వేల చెక్కుల్లో తప్పులున్నాయని, వాటిని వ్యవసాయ శాఖ బ్యాంకులకు తిరిగి పంపింది. ఈ 36 వేల చెక్కులను తిరిగి ముద్రించాలని ఆయా బ్యాంకులకు సూచించింది. రైతు బంధు పథకం కింద ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.4వేలు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూ.50 వేల నగదు కంటే ఎక్కువ వచ్చేలా భూవిస్తీర్ణం ఉన్న రైతులకు రూ.49,999లకు ఒక చెక్కు, మిగిలిన మొత్తానికి మరో చెక్కును ఇస్తామని వ్యవసాయ శాఖ ముందే చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మొదటి దశలో 23.16 లక్షల చెక్కుల ముద్రణలో ఒక్క చెక్కు కూడా రూ.49,999కి మించింది లేదు. అంటే మొదటి దశలో చెక్కులు అందజేసే రైతుల్లో 12 ఎకరాలకు మించిన రైతు లేరన్నమాటే.

Related Posts