పవిత్రమైన గంగానదిలోగాని,సముద్రంలోగాని స్నానం ఆచరించినా,ఎన్ని వ్రతాలూ,దానధర్మాలూ చేసినా అవి అన్నీ జ్ఞానాన్ని ఇవ్వలేవు.నిజమైన జ్ఞానం లేకపోతే ఎన్ని జన్మలెత్తినా వృథానే.అవి ముక్తిని కలిగించలేవు.
నిజానికి జ్ఞానం అంటే ఏమిటి అని ఆలోచిస్తే జగాలనేలే జగదీశ్వరుడైన విశ్వాత్మతో మనకు తాదాత్మ్యం కలిగించే జ్ఞానమే నిజమైన జ్ఞానం.అది తెలుసుకున్నవాడే నిత్య సంతోషి.అలాంటి వాడు యోగాభ్యాసం చేస్తున్నా,భోగాలను అనుభవిస్తున్నా,సంగరతుడైనా,సంగరహితుడైనా అతని మనసు భగవంతునిపైనే రమిస్తుంటుంది.అటువంటి సజ్జన సాంగత్యం ఐహిక,లౌకిక బంధాల్ని రూపుమాపుతుంది.అలా నిస్సంగత్వం వలన మోహం నశిస్తుంది. నిర్మోహత్వం చిత్త నిశ్చలతను కలిగిస్తుంది. నిశ్చల చిత్తం జీవన్ముక్తికి సోపానమవుతుంది.
భగవంతునిపై పూర్తి భక్తి,విశ్వాసాలతో ఇంద్రియాలనూ,మనసునూ అశాశ్వతమైన లౌకిక బంధనాలనుండి ముక్తం గావించినప్పుడు మన హృదయంలో అధివసించియున్న దైవాన్ని మనం చూడగలము.దీనికి మనం మనల్ని తెలుసుకోవాలి.కస్తూరి మృగం శరీరంనుంచి ఓ సువాసన వస్తుంది.కాని తనలో నుండే ఆ వాసన వస్తుందని తెలియక ఎక్కడినుండి వస్తుందా అని అది అడవంతా గాలించినట్లు మనమూ మనలోని భగవంతుని పసిగట్టలేక ఆలయాల చుట్టూ ఆధ్యాత్మికం అంటూ తిరుగుతుంటాము.
ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే భగవతత్త్వాన్ని తెలుసుకొనడం సులభం అవుతుంది.అది కాక మనం ఏది చేసినా అంతా వృథా శ్రమే. వినేదంతా చెత్తవాగుడే. కాలాన్ని దుర్వినియోగపర్చడం తప్ప మరేమీ కాదు.
సంతానం వల్లగాని,సంపదవల్లగాని అమృతత్వాన్ని పొందలేము.ఈ లోకంలో కనిపించే ప్రతిదానికీ నాశనమయ్యే తత్త్వం ఉంటుంది.మానవులకు సంబంధించిన వస్తు నిక్షేపాలు ఎంత మంచివైనా అవి అన్నీ ఒకనాటికి నశించేవే.ఎప్పటికీ నిలిచిఉండే వస్తువంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రతి వస్తువు గురించీ మానవుని అంతర్లీనంగా ఓ భయం ఆవరించి ఉంటుంది.ఆ వస్తువు చేయి జారినప్పుడు అంతులేని వ్యథకు లోనవుతుంటారు.అటువంటి వ్యథ లేనిది ఎప్పటికీ నశించనిది భగవంతుని తత్వమొక్కటే.అందుకే భగవంతుని గూర్చిన జ్ఞానం తెలుసుకుని తీరవలసినదే.
మంచిగంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి విలువ తెలియనట్లు మానవుడు నిత్యం భగవంతుని మాయావిలాసానికి అబ్బురం చెందుతూనే వ్యామోహపీడితుడు అవుతున్నాడు.మాయనుండి విడివడి వైరాగ్యాన్ని పొందుతున్నాడు కాని అది స్మశాన వైరాగ్యంగా మారి తిరిగి బురదకుంటలో వరాహం లాగా,శ్లేష్మంలో ఈగ లాగా సంసారమనే కూపంలో పడి కొట్టుకుంటున్నాడు.అందుకే నిజమైనజ్ఞానాన్ని ప్రోది చేసుకోవాలి.గురువులు చెప్పే ఉపన్యాసాలలోని అంతర్లీనమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి.తనవారి పైన కాని,తనవనుకునే వస్తుసంచయాలపైన గాని వ్యామోహం పెంచుకోకూడదు.
వరాలకోసం భగవంతుని పూజించక నిజమైన భగవంతుని తత్త్వం తెలుసుకోవాలి. నడవడిలో దివ్యత్వం కనిపించి తీరాలి.స్వార్థాన్ని విడనాడాలి.స్వజనం,పరజనం అనే తారతమ్యాలను దూరం చేసుకోవాలి.అందరిపై సమభావాన్ని చూపాలి .ఇలాంటి యదార్థ జ్ఞానాన్ని అలవరచుకుంటే భగవంతుని కృపకు పాత్రులమవుతాము.నామోచ్చారణకే తనవారిని చేసుకునే భగవంతుడు ఎంతటి కరుణామయుడో కదా!
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో