విజయనగరం, ఆగస్టు 21,
మాజీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు కిడారి శ్రవణ్‌కుమార్ కూడా అధికార పార్టీ బాటలో నడుస్తారా ? ఆయన కూడా త్వరలోనే సైకిల్ దిగిపోతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. వాస్తవానికి ఇలాంటి వార్తలు, వ్యాఖ్యలు చాలానే వస్తాయి. కానీ, ఏది నమ్మాలో. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అనే టైపులో సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రవణ్ వార్త కూడా అలాంటిదే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ మాటను స్వయంగా టీడీపీ నేతల నోటి నుంచే వినడంతో ఆశ్చర్యం వేస్తాంది
తండ్రి కిడారు సర్వేశ్వరరావు.. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిడారి సర్వేశ్వరరావు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అవ్వడంతో పాటు ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, 2016 కు వచ్చే సరికి ఆయన టీడీపీకి జై కొట్టారు. గిరిజన కోటాలో మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించారు. చంద్రబాబు కూడా అప్పట్లో ఆయనకు ఇదే హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మావోలు ఆయనను కాల్చేయడం, తర్వాత అనూహ్యంగా ఆయన పెద్దకుమారుడు కిడారి శ్రవణ్ రాజకీయాల్లోకి రావడం, ఎన్నికలకు కేవలం ఆరు మాసాల ముందు ఎలాంటి ప్రాతినిధ్యమూ లేని నాయకుడిగా రాష్ట్రం చరిత్రలో తొలిసారిగా ఆయన మంత్రి కావడం తెలిసిందే.
చివరకు తన ఆరు నెలల పదవీ కాలం పూర్తవ్వడంతో కిడారి శ్రవణ్ తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, గత ఏడాది ఎన్నికల్లో కిడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్‌గా కూడా ఉండడం లేదు. ఇదిలావుంటే, చంద్రబాబు యువ నాయకులకు పగ్గాలు అప్పగిస్తానని అంటున్నారే తప్ప. ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. మరోపక్క, విశాఖలో రాజధానిని చేస్తే.. పార్టీ పరిస్తితి మరింత గందరగోళంగా మారనుంది. పైగా వైఎస్సార్ సీపీ మరింత పుంజుకుంటుంది.ఇప్పటికే విశాఖ జిల్లాపై ప్రత్యేకంగా గురిపెట్టిన వైసీపీ నాయకులు అక్కడ టీడీపీలో ఉన్న ఏ నేతను అయినా తమ పార్టీలోకి లాగేసే ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఈ లిస్టులో గంటా లాంటి పెద్ద నేతల నుంచి చిన్నా చితకా నేతల వరకు చాలానే ఉన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నేతలు కిడారి శ్రవణ్ తో మంతనాలు జరుపుతున్నారు. వస్తే.. ఇప్పుడే వచ్చేయ్.. మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. పైగా ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కిడారి సోదరుడికి మంచి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ కావడం వెనుక కూడా ఇదే వ్యూహమని అంటున్నారు. దీనికి కిడారి శ్రవణ్ కూడా తలాడించినట్టు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పారు.వాస్తవంగా విశాఖ సిటీలో వైసీపీ బలహీనంగా ఉన్నా.. ఏజెన్సీలో ఆ పార్టీకి తిరుగులేదు.. అక్కడ వైసీపీకి చాలా బలమైన నేతలు కూడా ఉన్నారు. అయితే వైసీపీ వ్యూహంలో భాగంగా టీడీపీలో మాజీ మంత్రులు… ఇతర చోటా మోటా నేతలను కూడా రాజధాని పేరు చెప్పో లేదా ఇతర ప్రలోభాల ద్వారానో తమవైపునకు తిప్పుకుని ఉత్తరాంధ్రలో టీడీపీని పెద్ద దెబ్బ కొట్టడంతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆ పార్టీలో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక కిడారి శ్రవణ్ పార్టీ మారుతోన్న వ్యవహారాన్ని జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పినా ఆయన కూడా విని మౌనం వహించారని టాక్..?