YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు టీడీపీ ఖాళీ చేసేస్తారా...

కర్నూలు టీడీపీ ఖాళీ చేసేస్తారా...

కర్నూలు, ఆగస్టు 21,
ఆయ‌న టీడీపీ మాజీ నాయ‌కుడు. గ‌తంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. ఎవ‌రు అధికారంలో ఉంటే.. వారికి ఒత్తాసు ప‌ల‌క‌డం.. ఆయ‌న నైజం. వ్యాపారాలు, భాగ‌స్వామ్యాలు.. పెట్టుబ‌డులు వంటి లెక్కకు మిక్కిలి ఉన్న ఆయ‌నే టీజీ వెంక‌టేష్‌. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే, ఆయ‌న గ‌తంలో చంద్రబాబు వెంటే రాజ‌కీయాలు చేశారు. త‌ర్వాత వైఎస్ పిలుపుతో కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇక‌, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన ఈయ‌న.. టీడీపీ నుంచి దూర‌మైన‌ప్పటికీ.. ఆ పార్టీ కూసాలు క‌దిలిపోయే ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ని అంటున్నారు జిల్లా నేత‌లు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వెంక‌టేష్‌ ఆ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని.. ఇందుకు చాప‌కింద నీరులా పావులు క‌దుపుతున్నార‌న్న ప్రచారం జిల్లాలో జ‌రుగుతోంది.ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన కీల‌క నేత‌ల‌ను, ముఖ్యంగా టీడీపీలో ఉండి.. వైఎస్సార్ సీపీవైపు క‌న్నెత్తి చూడ‌ని, ప‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌ని వారిని.. బీజేపీ గూటికి చేర్చాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఇక‌, జీవం ఉండ‌ద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్రబాబు క‌థ సంపూర్ణం అవుతుంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో త‌న‌ను క‌లిసిన నేత‌ల‌ను ఆయ‌న బీజేపీలోకే చేర్చే బాధ్యత తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కురాలు.. మాజీ మంత్రి అఖిల ప్రియతో టీడీపీలో ఉంటే మీకు భ‌విష్యత్తు లేద‌ని ఆమెను పార్టీ మారేలా ప్రేరేపిస్తున్నార‌ట‌.అదేవిధంగా.. మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఫ్యామిలీని కూడా బీజేపీలోకి ర‌ప్పించేందుకు టీజీ వెంక‌టేష్‌ ప్రయ‌త్నిస్తున్నార‌ట‌. ఇప్పటికే కోట్లతో మంత‌నాలు కూడా పూర్తయ్యాయ‌ని.. ఆయ‌న త‌న ఫ్యామిలీతో స‌హా వ‌చ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇక‌, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి ఫ్యామిలీ కూడా టీజీ వెంక‌టేష్‌ బాట‌లో క‌మ‌లం గూటికి చేరేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ట‌. అయితే, వీరంతా ఇలా ఎందుకు వెళ్తున్నారు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే..రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి వీరికి జ‌గ‌న్‌తో తెగ‌తెంపులు అయిపోయింది. కొంద‌రికి జ‌గ‌న్ అంటే ఇష్టం లేదు.ఇక‌, రెండో కార‌ణం.. బీజేపీ ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంది కాబ‌ట్టి ఆ పార్టీకి ప్రజ‌ల్లో సానుకూల‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాంట‌ప్పుడు జ‌న‌సేన‌లోకే వెళ్లొచ్చుగా ? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తుంది. కానీ, రాష్ట్రంలో ఈ రెండు పార్టీల కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా.. రాక‌పోయినా.. మ‌ళ్లీ కేంద్రంలో మాత్రం బీజేపీ వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి త‌మ‌కు అంతో ఇంతో ల‌బ్ధి చేకూరుతుంద‌ని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా పార్టీ మారిన ఎంపీల్లో సుజనా, సీఎం ర‌మేశ్ లాంటి నేత‌ల‌కు బీజేపీలో కాస్తో కూస్తో ప‌లుకుబ‌డి ఉంది. టీజీ వెంక‌టేష్‌ని ఎవ్వరూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా లేదు.ఇదిలా ఉంటే టీడీపీ నేత‌ల‌ను బీజేపీలో చేర్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తోన్న ఆయ‌న త‌న కుమారుడు భ‌ర‌త్‌ను ఏం చేస్తార‌న్న ప్రశ్న కూడా ఉత్పన్నమ‌వుతోంది. భ‌ర‌త్ ప్రస్తుతం క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మ‌రి భ‌ర‌త్ కూడా కాషాయా కండువా క‌ప్పుకుంటారా ? లేదా టీడీపీలోనే ఉంటారా ? భ‌ర‌త్ పార్టీ మార‌క‌పోతే టీజీ వెంక‌టేష్‌ మాట‌ల‌ను మిగిలిన నేత‌లు మాత్రం ఎందుకు న‌మ్ముతారు ? ఈ ప్రశ్నల‌కు ఆయ‌న‌కే స‌మాధానం తెలియాలి. మొత్తంగా చూస్తే.. టీజీ వెంక‌టేష్‌ టీడీపీని జిల్లాలో భూస్థాపితం చేయాలని చూస్తున్నారు. మ‌రి బాబు ఎలా అడ్డుకుంటారో చూడాలి.

Related Posts