విశాఖపట్టణం, ఆగస్టు 21,
అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుందని అంటారు. అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలి. దానిని ఒక్కసారి చేజార్చుకుంటే.. ఏం జరుగుతుందో తెలియాలంటే.. విశాఖకు వెళ్లాల్సిందే.. అక్కడి బీజేపీ నాయకుడు, నార్త్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుగారిని కలవాల్సిందే. ఈయన బీజేపీ నాయకుడుగా ఉన్నప్పటికీ.. ఎటువెపు ఎప్పుడు మొగ్గుచూపుతారో చెప్పలేని పరిస్థితి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీని పొగిడారు. అసెంబ్లీలో చంద్రబాబును పదే పదే ప్రశంసలతో ముంచేత్తేవారు. అదే సమయంలో అసెంబ్లీలో జగన్‌ను కొనియాడారు. ఇక, కొన్ని సందర్భాల్లో చంద్రబాబు వృథా అన్నారు. ఆయన కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో పోలవరం బాగుందని చెప్పేవారు.దీంతో విష్ణుకుమార్ రాజు బీజేపీ నేతగా ఉండి.. ఇలా చేస్తున్నారేంటనే చర్చ మొదలైంది. ఇక, గత ఏడాది ఎన్నికల సమయానికి బీజేపీ గెలిచి సాధించేది లేదని తెలిసి కూడా ఆయన బీజేపీనే పట్టుకుని వేలాడారు. కానీ, వాస్తవానికి ఈ సమయంలోనే ఆయనకు వైఎస్సార్ సీపీ నుంచి నార్త్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చింది. కానీ, ఆయన అప్పట్లో జగన్ అధికారంలోకి వస్తారో .. రారో.. అనే అనుమానంతో కాదన్నారు. ఇక, అదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తారనే అతి విశ్వాసానికి పోయి.. ఆ టికెట్ కోరారు. కానీ, ఆయన అప్పటికే గంటా శ్రీనివాసరావు కు కన్ఫర్మ్ చేసేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో బీజేపీ తరఫునే పోటీ చేశారు. ఓడిపోయారు.కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీలో టికెట్ లభించని నేపథ్యంలో మళ్లీ జగన్ దగ్గరకు ఆయనే స్వయంగా వెళ్లారు. కానీ, అప్పటికే టికెట్‌ను వేరేవారికి కేటాయించిన నేపథ్యంలో అసలు పోటీకే దూరంగా ఉండాలని, తమ అభ్యర్థిని గెలిపించాలని జగన్ కోరారు. పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, దీనిని కూడా కాదన్నారు రాజుగారు. ఇక, ఇప్పుడు ఓటమి భారం. పైగా బీజేపీ పగ్గాలు సోము వీర్రాజుకు దక్కడంతో విష్ణుకుమార్ రాజు పరిస్థితి దారుణంగా మారింది. పార్టీలో ఆయనకు అందరితోనూ పడకపోవడమే కారణంగా కనిపిస్తోంది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారయణ వర్గంగా విష్ణుకుమార్ రాజు పేరు తెచ్చుకున్నారు.కొన్నాళ్లు వెంకయ్య వర్గంగా పేరుతెచ్చుకున్నారు. దీంతో సోముకు దగ్గరకాలేక పోయారు. అంతేకాదు. అసలు .. సోము రాష్ట్ర పగ్గాలు తీసుకుంటారని, అధిష్టానం ఆయనను అప్పగిస్తుందని కూడా విష్ణుకుమార్ రాజు ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీలో ఉండాలా ? బయటకు రావాలా ? అని చర్చించుకుంటున్నారు రేపు విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోతే.. ఈ సీటులోకి తాను రావాలని విష్ణుకుమార్ రాజు భావిస్తున్నారు. ఈ విషయంలో బాబు కూడా సానుకూలంగానే ఉన్నా.. పెద్దగా కేడర్‌లేని రాజుతో ఆయనకు ఒరిగేది ఏంటనేది ప్రధాన ప్రశ్న. ఇక, డమ్మీ అయిపోతున్న టీడీపీలోకి వచ్చి విష్ణుకుమార్ రాజు సాధించేది ఏంటనేది ఈయన తటపటాయింపు. దీంతో రాజుగారి రాజకీయ భవితవ్యంపై అనేక ప్రశ్నలు ముసురుకున్నాయి. మరి ఏం జరుగుతుందంతో చూడాలి.