ఏపీ హోదా కోసం జనసేన, వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. ఎన్నికల్లో సైతం కలిసి వెళ్లేందుకు గల అవకాశాలపైనా అన్వేషణ చేస్తున్నాయి. అదే సమయంలో ఎదుటి పక్షం తో తమకెంత మేరకు ప్రయోజనం సమకూరుతుందనే లెక్కలూ వేసుకుంటున్నాయి.అయితే ఇరు పార్టీల నేతల్లో సందేహాలు, అనుమానాల నీలినీడలూ వెన్నాడుతున్నాయి. మొత్తానికి రాజకీయ ప్రయోజనమే వీరి దోస్తీ ఎంతకాలం కొనసాగుతుందో, విడిపోతుందో, లేక మరింతగా పటిష్టమవుతుందో తేల్చబోతోంది.రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కు 25 లక్షల వరకూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నట్లుగా అంచనా. ఇది ప్రభావవంతమైన సంఖ్యే. వీరంతా ఆయన చెప్పినది చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారు. సొంత సొమ్ములతో తమ హీరోని ఆరాధిస్తూ ఉంటారు. సంప్రదాయ పార్టీల బలవంతపు సభ్యత్వం కాదు. అందువల్ల ఇదొక శక్తిమంతమైన ఓటు బ్యాంకే. డబ్బులకు అమ్ముడుపోయి ప్రత్యర్ధులకు ఓట్లేసే దౌర్భాగ్యం కూడా ఉండదు. కానీ వీరందర్నీ ఏకతాటిపైకి తెచ్చి లక్ష్యం వైపు నడపటం మాటలు కాదు. కానీ ఒక బలహీనత వెన్నాడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మినహాయిస్తే వీరి సంఖ్య చెల్లాచెదురుగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లోని దాదాపు 15 నియోజవర్గాల్లో లక్షకు పైగా పవన్ అభిమానులున్నట్లుగా చెబుతున్నారు. సామాజిక సమీకరణల దృష్ట్యా కొంచెం అటుఇటుగా అది నిజమే. ఈ నియోజకవర్గాల్లో గెలుపు సాధించేందుకు లేదంటే నియోజకవర్గాల ఫలితాన్ని శాసించేందుకు పవన్ సేన సరిపోతుంది. కానీ పొలిటికల్ లైన్ మిస్సవుతోంది. స్థిరంగా ఒకే ఆశయంతో వీరు నడవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ లోపాన్ని పూరించేందుకు వామపక్ష భావజాలాన్ని జనసేనకు రంగరించేందుకు పవన్ పూనుకున్నారు. దీనివల్ల సైద్దాంతిక ప్రాతిపదిక లభిస్తుంది. పోరాటానికి ఫోర్సు లబిస్తుందనేది అంచనా. ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడే. అంతేకాకుండా ఏదో గాలివాటం పార్టీగా ముద్రపడకుండా గాడిన పడే అవకాశం పెరుగుతుంది. వామపక్షాలు పోరాటపటిమకు పెట్టింది పేరు. అది జనసేనకూ ప్లస్ అవుతుంది. ఆ అంచనాతోనే వామపక్షాలతో జనసేనాని జట్టుకట్టినట్లుగా ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి.వామపక్షాలకు ఉద్యమాలు చేయడంలో ఆరితేరిన నాయకత్వం ఉంది . కానీ మీడియా, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలకు అన్నీ సమకూర్చిపెట్టాలని డిమాండ్లు చేస్తూ సీపీఐ, సీపీఎం లు నిరంతరం ఆందోళనలు చేస్తుంటాయి. అంగన్ వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులు, అసంఘటిత కార్మికుల సమస్యలపై వామ పక్ష నేతలు నినదిస్తూనే ఉంటారు. సమస్యలు పరిష్కారం కావు , కనీసం ప్రజల దృష్టిలో కూడా పడవు. ఉద్యమం చేస్తున్నవారిని బయటికి లాగిపడేయడమో, లేదంటే అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించడమో సాగుతూ ఉంటుంది. గడచిన నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తీరు కూడా ఇదే. రాజధాని సమస్యలు, రైతు పోరాటాలు, మునిసిపల్, అంగన్ వాడీలపై అనేక ఉద్యమాలు చేశారు. విస్తృత స్థాయిలో ప్రచారం లభించలేదు. ప్రభుత్వం దాదాపు అన్ని ఉద్యమాలను అణచివేసిందనే చెప్పాలి. కానీ జనసేన కలిసిన తర్వాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. యువతరం ఆకర్షితులు కావడంతో ఎర్రజెండా రెపరెపలాడుతోంది. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ వామపక్షాల బాటే తన మాట అంటూ కొన్ని సందర్బాల్లో చిలుకపలుకులు పలకడంతో వారిలో మరింత ఉత్తేజం పెరిగింది. గతంలో ప్రతి సందర్బంలోనూ లాఠీచార్జీలకు గురికావడం, నిర్బంధం, కేసులు వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. తాము అధికారంలోకి వచ్చే అవకాశం ఎలాగూ లేదు. కనీసం నామమాత్రంగా సీట్లు కూడా సొంతబలంతో గెలుచుకునే సామర్ధ్యం లేదన్న సంగతిని సీపీఐ, సీపీఎంలు గుర్తించాయి. టీడీపీ, బీజేపీల నుంచి వేరుపడి పవన్ కల్యాణ్ వామపక్షాలకు దన్నుగా నిలుస్తానని ప్రకటన చేయడంతో బలమైన మద్దతు లభించినట్లు గా ఆయా పార్టీల అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే సిద్దాంతాలు, శషభిషల జోలికి పోకుండా పవన్ పిలిచినప్పుడల్లా సమావేశాలకు హాజరవుతూ తమ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని నాయకులు చూస్తున్నారు.