YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సై...అంటున్న గవర్నర్

సై...అంటున్న గవర్నర్

హైద్రాబాద్, ఆగస్టు 21, 
గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తమిళి సై గవర్నర్ గా ప్రభుత్వాన్ని ఆదేశించడంలోనూ, సూచించడంలోనూ ఎవరూ తప్పు పట్టరు. అయితే గవర్నర్ జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలు కావడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతుంది. సాధారణంగానే తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారా? దీని వెనక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అన్న చర్చ అధికార టీఆర్ఎస్ లో జరుగుతుంది.తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని అనూహ్యంగా తెలంగాణ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. తమిళిసై బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే భిన్నంగా తమిళిసై ఆసుపత్రులను సందర్శించారు. వైద్యులలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా వైస్ ఛాన్సిలర్ లతో విద్యా విధానాలపై సమీక్షించారు. కరోనా తీవ్రత పెరిగిందని దాదాపు నాలుగైదు సార్లు తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు.ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే తమిళిసై జాతీయ మీడియాతో వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా ఉధృతిని సర్కార్ సరిగా అంచనా వేయలేకపోయిందని తమిళిసై వ్యాఖ్యానించారు. తాను రాసిన లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తమిళిసై పేర్కొన్నారు. టెస్ట్ లు ఎక్కువ సంఖ్యలో జరగడం లేదన్న అభిప్రాయం నెలకొందన్నారు.
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ లో కలకలం రేపాయి. గవర్నర్ వ్యాఖ్యలు రాజకీయ కోణంలో చూడాలా? మామూలుగానే అన్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసి ఆ తర్వాత తొలగించారు. కాంగ్రెస్, బీజేపీలు గవర్నర్ వ్యాఖ్యలను చూసైనా ప్రభుత్వం కరోనా విషయంలో తప్పులు సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద తమిళిసై తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారనున్నారా? అన్న సందేహం అధికార పార్టీలో కలుగుతుంది.

Related Posts