YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూడు సీట్లు...30 మంది ఆశావహులు

మూడు సీట్లు...30 మంది ఆశావహులు

హైద్రాబాద్, ఆగస్టు 21, 
తెలంగాణ శాసన మండలిలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఆశావహులు చాలా మంది ఉండటంతో ఉన్న వారికి రెన్యువల్ చేస్తారా? లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎన్నికలకు ముందు పార్టీని వీడటంతో ఆయనపై అనర్హత వేటు పడింది. సీనియర్ నేత నాయని నరసింహారెడ్డి పదవీకాలం పూర్తయింది. కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవి కాలం కూడా కొద్ది రోజుల క్రితమే పూర్తయింది.దీంతో ఈ మూడు పదవుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 7వ తేదీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే ఈ ఖాళీలను భర్తీ చేస్తారంటున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.ఇందులో సీనియర్ నేత నాయని నరసింహారెడ్డికి రెన్యువల్ చేస్తారా? లేదా? అన్నదే ఉత్కంఠగా మారింది. నాయని తొలి నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. కేసీఆర్ కూడా తొలి విడత పాలనలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన తన అల్లుడి కోసం సీటు అడిగినా ఇవ్వలేదు. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం నాయని నరసింహారెడ్డి ప్రయత్నించారు. తన మనసులో మాటను కేసీఆర్ కు కూడా చెప్పారు. రాజ్యసభ పదవి కూడా ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్సీ పదవిని నాయనికి కేసీఆర్ రెన్యువల్ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.మరోసారి కర్నె ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో ఒకరికి ఇచ్చే అవకాశముందని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. తుమ్మల కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు కావడం, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో తుమ్మలకు ఖచ్చితంగా పదవి దక్కుతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యే ముగ్గురు ఎవరన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది.

Related Posts