నిజామాబాద్, ఆగస్టు 21,
ఓ సామాన్య రైతు చదివింది ఆరో తరగతే కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ప్రాణం అందుకే ఆయన్ను శాస్త్రవేత్తను చేసింది. వరిలో ప్రయోగాలు చేస్తూ శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తగా మారిన రైతు కథ ఇది. తనకు ఉన్న మూడు ఎకరాల్లో 49 రకాల దేశీ వరి వంగడాలు పండిస్తూ క్షేత్రాన్ని సప్తవర్ణశోభితంగా మార్చారు. విదేశీ వరి వెరైటీలు సైతం సాగు చేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు , గోధుమ రంగులతో తన వరిక్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఇందూరు రైతు శాస్త్రవేత్త చేస్తున్న ప్రయోగాలు ఏంటి..?ఆయన పండిస్తున్న వెరైటీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. ఈ ఆదర్శ రైతు పేరు నాగుల చిన్న గంగారాం అలియాస్ చిన్ని కృష్ణుడు. జక్రాన్ పల్లి మండలం చింతలూరుకు చెందిన చిన్ని కృష్ణుడు నగరంలో స్ధిరపడ్డాడు. రూరల్ నియోజకవర్గంలోని గూపన్ పల్లి శివారులో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి అక్కడే తన వరి క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చారు. తీవ్ర వర్షాభావ పరిస్ధితుల్లోనూ 49 రకాల వరిని సాగు చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. దేశీ రకాలే కాదు విదేశాల్లో డిమాండ్ ఉన్న వినూత్న వరి వంగడాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు.అతని సొంతం చంద్రమండలం తరహాలో పొలంలో ఆకారం చేసి అందులో నారుమడి పోశారు. జపాన్ తరహాలో డిజైన్ ల సాగుకు శ్రీకారం చుట్టారు. థాయిలాండ్, పాకిస్థాన్, కాలిఫోర్నియా, ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, జపాన్ దేశాల్లో పండే వరిని ఇక్కడ పండించేందుకు నారు మడిని సిద్ధం చేశారు. మన వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని విదేశీ వరి వంగడాలు మంచి దిగుబడి ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రయోగాల చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడు వరి సాగులోనే కాదు వ్యవసాయంలోనూ ఇతర రైతులకు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. రసాయనాల జోలికి వెళ్లకుండా పూర్తిగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వార వర్షాభావ పరిస్ధితులను తట్టుకునే శక్తి వస్తుందని అందుకే ప్రస్తుత వర్షాభావ పరిస్ధితుల్లోనూ తాను 49 రకాల వరిని సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఈ రైతు 111 రకాల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ 3 ఎకరాల భూమిలో అది సాధ్యం కాకపోడం వల్ల ప్రస్తుతం 49 రకాల వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టారు. మరో 11 రకాల వెరైటీలు తెచ్చి 60 రకాల వెరైటీల వరిసాగు చేస్తానని చెబుతున్నారు చిన్ని కృష్ణుడు. ప్రభుత్వాలు ప్రతి రైతును ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తే వ్యవసాయం పండగలా మారుతుందని రైతు చిన్నకృష్ణుడు చెబుతున్నాడు. వేప పిండి, వర్మి కంపోస్టు, ప్రతి రైతుకు ఓ గోమాతను ఉచితంగా ఇవ్వాలని ఆ దిశలో సర్కారు ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయంటున్నారు. తాను ఓ ప్రయోగంగా ప్రకృతి సేద్యం లో అత్యధిక వెరైటీల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తన ప్రయోగం ఫలిస్తే మరికొన్ని రకాల వరి సాగు చేస్తానని అంటున్నాడు రైతు. నిజామాబాద్ జిల్లా రైతు శాస్త్రవేత్తలను అబ్బుర పరిచేలా వరిలో ప్రయోగాలు చేస్తూ తన పేరుతో ఓ కొత్తరకం వరిని సైతం కనిపెట్టాడు. ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉంది. ఇలాంటి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే అద్బుతాలు జరిగే అవకాశం ఉందని రైతు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రకృతి వ్యసాయంతో పాటు విదేశీ రకాల వరి సాగుకు కేంద్ర బిందువుగా మారిన చిన్ని కృష్ణుడు ప్రయోగాలు ఫలించాలని మనమూ ఆశిద్దాం.