హైద్రాబాద్, ఆగస్టు 21,
ఆబ్కారీ ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. దాదాపు రెండు రెట్లకుపైగా అధికమైంది. గత నాలుగేండ్లలో వచ్చిన ఆదాయం ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ఆర్నెల్లలోపు వచ్చిన ఆదాయం మరో ఎత్తు. ఎప్పుడూ లేనంతగా ఈ ఆర్నెల్ల కాలంలో ఆబ్కారీ శాఖకు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ. 13వేల కోట్లు సమకూరింది. వచ్చే నాలుగు మాసాల్లో ఇది సుమారు. రూ. 27 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మధ్య పెంచిన బీర్ల ధరలతో అదనంగా మరో రూ.460 కోట్లు ఖజానాకు చేరుతున్నది. నిబంధనలు పట్టించుకోని వైన్‌షాపుల యజమాన్యాలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సర్కారు సైతం పరోక్షంగా వారికి సహకరిస్తున్నది. పర్మిట్‌రూంల విషయంలో విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులైన పారిస్తున్నది. రాష్ట్రంలో 2,216 మద్యం షాపులు ఉండగా అందులో 2వేల షాపులకు పర్మిట్ రూంలను అనుమతులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 75షాపులకు పర్మిట్ రూంలు ఉం డగా, 1925 షాపులు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. పర్మిట్ రూంల అనుమతుల వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 112కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈపర్మిట్ రూంలను మద్యం షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర వ్యక్తులకు లీజుకుఇస్తూ వారు కూడా లక్షల రూపాయ ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పట్టణాలు, మన్సిపాల్టీల్లో లీజు రూపంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500, జీహెచ్ ఎంసీ, నగరాల్లో రోజుకు రూ.2వేలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు షాపుల్లోను తినుబండా రాలు, వాటిర్ బాటిల్స్, గ్లాసులను విక్రయిస్తున్నారు. మద్యం షాపుల కోసం దరఖాస్తు, లైసెన్స్ రూపంలో చెల్లించిన డబ్బు లను యజమానులు తిరిగి ఈవిధంగా రాబట్టుకుంటున్నారు. బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఇలా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. నిబంధనలకు విర్ధుంగా మద్యం షాపుల్లో పర్మిట్ రూంల పేరుతో పెగ్గుల దందా నడుస్తున్నది. షాపుల్లో పెగ్గుల రూపంలో మద్యం విక్రయించరాదన్న మార్గదర్శకాలు సైతం ఉన్నాయి. కానీ మద్యం షాపుల యాజమాన్యాలు ఎక్సైజ్ అధికారులకు ముడుపులు ముట్ట చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన టార్గెట్‌ను చేరుకోవాలంటే ఈ తరహాలో మద్యం అమ్మకాలు తప్పవని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. జాతీయ రహ దారుల వెంట ఉన్న మద్యంషాపులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా సర్కారు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నూతన ఆబ్కారీ విధానం లోనూ జాతీయ రహదారులకు ఇరు ప్రక్కల మద్యం షాపు లను అనుమతించడం గమనార్హం. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవద్దన్న ఉద్దేశంతోనే సర్కారు పెగ్గు అమ్మకాల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తు న్నాయి. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈఏడాది ఏకంగా 27వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలన్న యోచనలో సర్కారు ఉంది. పెగ్గు పద్ధతిలో మద్యం విక్రయాల కోసమే ఆబ్కారీ శాఖ అధికారులు షాపులకు పర్మిట్ రూంలను అనుమతిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీలు, పట్టణాలుమున్సిపాల్టీల్లో పర్మిట్ రూంల కోసం రూ. లక్ష, కార్పొరేషన్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.2లక్షలు మద్యం షాపుల యజమానుల నుంచి వసూలు చేస్తున్నది. పర్మిట్ రూంలను మద్యం షాపుల యాజమాన్యాలే నిర్వహించాల్సిఉంది. కాని పర్మిట్ రూంల ను మద్యంషాపుల యాజమానులు ఇతరులకు లీజుకు ఇస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇవి కూడా బార్‌లను తలపించేలా బిర్యానీలు విక్రయిస్తున్నారు. బార్‌లలో మద్యం, తినుభండారాలు అధిక ధరలు ఉండటంతో మద్యం ప్రియులంతా పర్మిట్ రూంల వైపే మొగ్గు చూపుతున్నారు.