విజయవాడ, ఆగస్టు 21,
విజయవాడ వాసులకు గుడ్‌న్యూస్. ఎన్నో ఏళ్ల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. నగరానికే మణిహారంగా మారనున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖాయమైంది. సెప్టెంబర్ 4న విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి పరిశీలించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఫ్లై ఓవర్ ప్రారంభంకానుంది.దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని.. చిన్న చిన్న పనులను ముగించి వచ్చే నెల 4న ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. అదే రోజు ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రూ.13 వేల కోట్ల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తి కావడంతో ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు. అంతేకాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒకడుగు ముందుకు వేసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఫ్లై ఓవర్ పనుల పురోగతిని వివరించారు.