అమరావతి ఆగస్టు 21,
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్టుగా సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు గురువారం ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబం«ధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అ«ధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు