అక్షయ తృతీయ దగ్గర పడుతోంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధర గత వారంలో చుక్కలు తాకింది. పది గ్రాముల బంగారం ధర 32 వేల మార్కును అధిగమించింది. ఇంకా వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. మరో వైపు అమెరికా-చైనా ట్రేడ్ వార్ కొనసాగే పరిస్థితులుండటంతో బంగారం కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ ఎగసిన ఈ ధర ఇంతవరకూ అత్యధికమైంది. .నిజానికి ఇటీవల చాలా రోజుల నుంచి రూ.30 వేలకు మించి బంగారం ధరలు పైకి పోలేదు. మే 9,2016 అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.29,860గా ఉంది. ఈసారి మాత్రం బంగారం ధరలు అక్షయ తృతీయకు ముందే పైపైకి పోతున్నాయి. ఇది వచ్చే 3-4 రోజులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి .ఇప్పుడైతే అమెరికా,చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు అంతర్జాతీయంగా ప్రియమయ్యాయి. మధ్య తరగతి బంగారం కొనేందుకు కష్టమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయకు బంగారం కొనడం అంత సులువైన వ్యవహారమేమీ కాదు.