YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆకారమే ఓంకార స్వరూపమై...విఘ్నాలు తొలిగించేవిఘ్నేశ్వరుడు వినాయకచవితి ప్రత్యేక కథనం

ఆకారమే ఓంకార స్వరూపమై...విఘ్నాలు తొలిగించేవిఘ్నేశ్వరుడు వినాయకచవితి ప్రత్యేక కథనం

మన దేశంలో వినాయకచవితి పండగ ఒక పెద్ద ఆధ్యాత్మిక అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన వైభవ వేడుక .నిజానికి హిందూ పౌరాణిక దేవుళ్ళలో గణపతి, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరనేది వాస్తవం. శ్రీరామ నవమి, శ్రీ కృష్ణాష్టమి, హనుమత్ జయంతి కంటే కూడా గణేశ చవితి ప్రతీ ఇంట్లో ప్రతీ వీథిలోనూ జరుపుకొనే ఆనంద హేల. చిన్నా పెద్దా జరుపుకునే సంబరాల కేళి  ఘంటమెత్తకుండా భావం చెడకుండా పంచమవేదమైన భారతాన్ని వ్యాస మహర్షి చెప్పగా రాసిన వ్రాయసకాడైన వినాయకుడు, నిత్యం మనపూజలో తొలి పూజ అందుకునే దైవం కూడా. వినాయకుడంటే తెలియని మనిషి ఉండడు. ఆ ఆకారమే ఓంకార స్వరూపమై తేజోమయమై ప్రసన్నతను సంతరించుకొని జగమంతా అర్చనలందుకునే ఆనంద నందన స్వరూపం. విఘ్నాలు లేకుండా విజయసిద్ధికై  ప్రపంచమంతా (బర్మా, థాయిలాండ్, చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా, మారిషస్) లలో జరుపుకునే పండగ. ఈ పండగ శోభ నయనానందం. వీథులన్నీ మంటపాలే. ఉదయం సాయం సంధ్యల అర్చనలు సాంస్కృతిక వేడుకలు-నవరాత్రి వైభవ దీపికలతో ఈ నవరాత్రులలో  ఇంటింటా పండగే. మన భాగ్యనగరంలో ఈ వేడుకలను వీక్షీంచడానికి విదేశీ పర్యాటకులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ఛానల్స్, వార్తా విలేఖరులు తప్పని సరిగా హాజరై వీడియో తీసి ప్రసారం చేసి ఈ పర్వదిన శోభను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నాయి.
వినాయక  కథ సాధారణంగా అందరికీ చిరపరిచితమైన గాథనే. గజాసురుడనే రాక్షసుడు యజ్ఞ యాగాదులకు విఘ్నం కలిగించగా శివుడు  గజాసురుణ్ణి వధించి, ఆ అసురుని కోరిక మేరకు తన తల లోకవంద్యం కావాలని కోరగా ఆ తలతో కైలాసానికి విజయోత్సాహంతో చేరతాడు. పార్వతి కైలాసంలో పిండితో బాలున్ని చేసి ప్రాణంపోసి ద్వారం వద్ద కాపలా పెడుతుంది. ఆ బాలుడు శివుని అడ్దగించడంతో  కోపంతో మహాదేవుడు ఆ బాలుని తల నరకుతాడు.  పార్వతి రోదించడం, శివుడు గజాసురుని తలను ఆ బాలుని తలకు చేర్చి పునర్జీవితుణ్ణి చేయడం గణపతి జననం - మహాదేవుని సైన్యమైన గణాలకు అధిపతిని నియమించదలచిన కైలాసనాథుడు కుమారస్వామి,గణపతులకు  భారతావనిలోని పవిత్ర నదులన్నీటిలోనూ స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ గణాధిపత్యం లభిస్తుందని తెలుపుతాడు. కుమార స్వామి వేగంగా నెమలి వాహనం పై పరుగు పరుగున వెళ్ళడం... ఖిన్నుడైన గణపతి తను తన వాహనమైన ఎలుకపై ఈ పని తోందరగా చేయలేనని వేడుకోని తన అశక్తతను తెలిపి పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లుతాడు. ఉపాయంగా తల్లితండ్రుల చుట్టు  భక్తితో మూడు ప్రదక్షణలు చేయడం వల్ల ఆ ఫలం లబిస్తుందని శివుడు తెలపగా, తక్షణమే ఆచరించిన గణపతి - ఆ పుణ్య ఫలితంగా భూలోకంలో నదులన్నీటీలోనూ స్నానమాచరించడానికి వెళ్ళిన కుమారస్వామికి  తనకంటె ముందుగా ప్రతీచోటా కనిపించిన గణపతి, తిరిగి కైలాసంలోనూ ముందుగా తల్లితండ్రుల వద్ద నిలచిన గణపతి దర్శనం ఇస్తాడు. ఫలితంగా శివుడు  గణేశునికే గణాధిపత్యమప్పగిస్తాడు. ఆ సందర్భంగా సకల దేవతలు వినాయకుణ్ని  ధూప దీప నైవేద్యలతో అర్చన చేసి విఘ్నాధిపతిగా పట్టాభిషేకం చేస్తారు. కడుపారా నైవేద్యాలు ఆరగించిన గణపతి, శివ పార్వతుల  దీవెనలందుకోవాలని  సాష్టాంగ నమస్కారం చేయాలనే ఆరాటానికి పొట్ట అడ్డురాగా సతమతమవుతున్న గణపతిని చూసి  శివుని తలపై నున్న చంద్రుడు నవ్వగా ఆ దృష్టి దోషంతో వినాయకుని పొట్ట పగిలి నిర్జీవితుడవుతాడు. కోపగించిన పార్వతి చంద్రుని చూసినవారు నీలాపనిందల పాలై కష్టాల పాలవుతారని శపిస్తుంది. లోక హితం కాని ఈ శాపం ఉపసంహరించాలని  బ్రహ్మాది దేవతలు కోరగా, వారి మాటను మన్నించిన పార్వతి ఒక్క చవితి రోజు మాత్రం చంద్రున్ని చూడరాదని శాపాన్ని సవరిస్తుంది. చవితిరోజు ముని పత్నులు అనుకోకుండా చంద్రుణ్ణి చూసి నీలాపనిదల పాలవడం - పాలు పితుకుతూ పాలలో చందుణ్ణి చూసిన శ్ర్రీ కృష్ణుడు శమంతకమణి అపహరించాడన్న నిందకు లోనవుతారు. ఆ నిందబాపుకున్న కృష్ణునితో - వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించి,  ఈ శమంతక మణి కథను విని అక్షతలు తలపై  చల్లుకొన్నవారు నీలాపనిందలకు గురికారని పార్వతి సంపూర్ణ శాప ఉపసంహరణ  తో  ఈ కథ సుఖాంతం. లోకా సమస్తా సుఖినో భవంతు .
ఇది ఒక ఆధ్యాత్మిక పరిమళాల శొభాయమైన పర్వదినమైనా ఈ ఉత్సవాలలో ఒక సామాజిక ప్రయోజనం కూడా అంతర్లీనమై ఉన్నది. కొన్ని వందల మందికి ఈ పండగ వేడుకలలో పని కల్పించబడుతుంది. విగ్రహాల తయారు చెసే వాళ్ళు( సామాన్యంగా వీరంతా సంచార జీవులే), టెంటులు, పందిళ్ళు వేసే వారు, అలంకారాలు చేసే వారు(డెకరేషన్), పూలు పండ్లు పత్రి అమ్మే వారు ( సాధారణంగా నిత్యం అమ్మకాలున్నా ఈ నవరాత్రులలో విశేష అమ్మకాలుంటాయి), సౌండ్, లైట్ సిస్టమ్ అమర్చే వారు, ఆటొ, ట్రాక్టర్  లాంటి వాహనాలు నడిపేవారు, నైవేద్యాలు, అన్నదానాలకు వంటవారు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే సంగీత ,నాట్య కళాకారులు ,ఆర్కెస్ట్రా ,పూజా సామగ్రి ,వ్రత కథల పుస్తకాలు ,కాషాయ వస్ర్తాలు ,జండాలు ,నూతనంగా గణపతిపై గాయకులు పాడిన సిడి లు చేసి అమ్ముతున్న దుకాణాలు వీరందరికి వినాయక చవితి ఆర్ధికంగా అండగా నిలబడుతోంది.

Related Posts