అమరావతి ఆగష్టు 21
కోవిడ్ బాధితులకు మంచి వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనాపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 138 నుంచి 287కు పెంచాలని ఆదేశం. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలి. కోవిడ్ కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం నిర్ణయం. కోవిడ్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలి. అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్ ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వండి. ఇప్పుడున్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్త స్థాయిలో ఉండాలి. నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలి. కోవిడ్ కాల్ సెంటర్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. పారిశుద్ధ్యం బాగుండాలి, చికిత్స తీసుకుంటున్నవారికి మంచి భోజనం అందాలి. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలి. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారికి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలి. మనమే ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలి. రిఫరల్ ప్రోటోకాల్ చాలా స్పష్టంగా ఉండాలి. విలేజ్, వార్డు క్లినిక్స్ నుంచి ఈ ప్రోటోకాల్ అమలు జరగాలి. ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకునేందకు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్‌సెంటర్ ఉండాలి. ఈ నంబర్‌ను అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుల్లో ఉంచాలి. పేషెంట్‌ను ట్రీట్‌చేయకుండా అవసరంలేకుండా రిఫర్ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాలి. ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలును పరిశీలించాలి. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అక్కౌంట్‌లో పడాలి’ అని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.