అనంతపురం, ఆగస్టు 24
మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లే. ఆయన ఇక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. రఘువీరారెడ్డి ప్రస్తుతం సొంత గ్రామమైన నీలకంఠాపురంలోనే ఉంటున్నారు. గ్రామంలో పెద్దగా వ్యవహరిస్తూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తున్నారు. వ్యవసాయ పనులు, దైవపూజలతో రఘువీరారెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు.రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైఎస్ జగన్ వెంట నడవలేదు. దీంతో 2014 ఎన్నికలకు ముందు ఆయనకు పీసీసీ బాధ్యతలను అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడుగా రఘువీరారెడ్డి క్షణం తీరిక లేకుండా గడిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోలేదని రఘువీరారెడ్డి సర్దిచెప్పుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.2019 ఎన్నికలకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ ఒక్క స్థానం గెలవకపోగా అన్న నియోజకవర్గాల్లో దాదాపు డిపాజిట్ కోల్పోయింది. రఘువీరారెడ్డి సయితం ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్వగ్రమామమైన నీలకంఠాపురంలోనే వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు.రఘువీరారెడ్డి ఇప్పుడు నీలకంఠాపురం గ్రామానికి పెద్దదిక్కుగా మారారు. అక్కడే ఉండి వ్యవసాయ పనులు చూసుకోవడంతో పాటు గ్రామ సమస్యలను కూడా సొంత ఖర్చుతో పరిష్కరిస్తున్నారు. చెరువ గట్టు తెగిపోతే రఘువీరారెడ్డి దగ్గరుండి పనులు చేయించారు. ఇక రఘువీరారెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమయినట్లే. ఆయనకు బెంగళూరులో ఉన్న వ్యాపారాలు కూడా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆయన పూర్తిగా గ్రామానికే పరిమితమయ్యారు. దాదాపు పదిహేనేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా భద్రత మధ్య కార్లలో తిరిగిన రఘువీరారెడ్డి ఇప్పుడు సాధారణ జీవితాన్ని కోరుకుంటున్నారు.