YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కుతున్న ప్రొద్దుటూరు రాజకీయాలు

వేడెక్కుతున్న ప్రొద్దుటూరు రాజకీయాలు

కడప, ఆగస్టు 24 
ప్రొద్దుటూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నియోజకవర్గంలో సీనియర్ నేత వరదరాజులు రెడ్డిని వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నంతో పాటు వైసీపీ కూడా ఆయన రాకను కోరుకుంటుంది. త్వరలోనే వరదరాజులురెడ్డికి వైసీపీ కండువా కప్పుతారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం వరదరాజులు రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో గత ఏడాది నుంచి పాల్గొనడం లేదు.వరదరాజులు రెడ్డి వర్గం కూడా టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంది. వరదరాజులు రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వరదరాజులు రెడ్డి, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరస విజయాలు సాధించారు. రాష్ట్ర విభజనతో వరదరాజులు రెడ్డి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరిపోయారు.కాని వరదరాజులురెడ్డికి 2014 టిక్కెట్ ను టీడీపీ ఇచ్చినా ఆయన గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ప్రొద్దుటూరు టీడీపీలో వరదరాజులురెడ్డి, లింగారెడ్డి గ్రూపులుండేవి. అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లింగారెడ్డికి మద్దతుగా నిలిచారు. సీఎం రమేష్ పై నేరుగా వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగేవారు. అయితే ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే వరదరాజులు రెడ్డి మద్దతు వైసీపీ అవసరం.అందుకోసమే వరదరాజులు రెడ్డికి కండువా కప్పేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరదరాజులు రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి తమను నమ్ముకుని ఉన్న ప్రసాద రెడ్డిని హర్ట్ చేయడం ఇష్టంలేక ఇప్పటి వరకూ వైసీపీ అధిష్టానం ఆగిందంటున్నారు. త్వరలోనే వరదరాజులురెడ్డికి వైసీపీ కండువా కప్పేస్తారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. మొత్తం మీద వరదరాజులు రెడ్డి రాకతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా, వైసీపీలో మళ్లీ గ్రూపుల గొడవ పెరిగే అవకాశముంది.

Related Posts