నెల్లూరు, ఆగస్టు 24
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ రాజకీయాలు మారుతున్నాయా ? నిన్నటి వరకు అంతా తానే అయి నడిపించిన నాయకుడు, యువ మంత్రి, బీసీ వర్గానికి చెందిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఒంటరి అవుతున్నారా ? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. వరుస విజయాలు దక్కించుకున్న అనిల్.. జగన్‌కు వీరాభిమానిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను కాదని బీసీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ, జగన్ ఆయనకు మంత్రి పదవిని అప్పగించారు. దీంతో అనిల్ జిల్లాలో తన విశ్వరూపం చూపిస్తున్నారన్న టాక్ బలంగా వచ్చేసింది.అసలు రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట వంటి నెల్లూరులో అనిల్ తనదైన శైలిలో చక్రం తిప్పడాన్ని రెడ్డి వర్గానికి చెందిన కీలక నాయకులు సహించలేక పోతున్నారు. దీనికి తోడు అనిల్ కుమార్ దూకుడు పెంచడం, ఎవరినీ లెక్కచేయడనే పేరు తెచ్చుకోవడం, అధికారులు అందరినీ తన గుప్పిట్లో పెట్టుకోవడం, నియోజకవర్గాల్లో ఏ పనికావాలన్నా కూడా మంత్రి అనుమతి తప్పనిసరి అనే విషయం తెరమీదికి రావడంతో వెంకటగిరి నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ఒకసారి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మేం పార్టీ వాళ్లం కాదా ? పార్టీ తరఫున గెలవలేదా ? అని కూడా ప్రశ్నించారు. ఇక, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా ఇదే ధోరణిలో ఉన్నారు.వీరంతా ఒక జట్టుగా ముందుకు కదులుతున్నారు. ఇక, అనిల్‌తో నిన్న మొన్నటి వరకు కూడా కలిసి మెలిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో అనిల్‌కు దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయి. పైకిబాగానే ఉన్నప్పటికీ.. ఆయన కూడా మంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇక, ఆత్మకూరు నుంచి వరుస విజయాలు సాధించి.. మంత్రి పీఠం దక్కించుకున్న మేకపాటి గౌతం రెడ్డి తటస్థంగా ఉంటున్నారు. అదే సమయంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరినీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడు మిగిలిన రెడ్లంతా ఓ జట్టుగా ఉంటూ.. అనిల్‌ను ఒంటరిని చేశారనే టాక్ బాగానే వినిపిస్తుండడం గమనార్హం. పైగా నిన్న మొన్నటి వరకు కూడా అనిల్‌తో కలిసి మెలిసి తిరిగిన కోటంరెడ్డి కూడా ఆయనను పక్కన పెట్టడంతో ఇప్పుడు పూర్తిగా ఒంటరయ్యారనే వాదనకుబలం చేకూరుతోంది