విజయనగరం, ఆగస్టు 24
పూసపాటి వారి మూడవతరం వారసురాలు, యువరాణి సంచయిత గజపతిరాజు. ఆరు నెలల క్రితం వరకూ పెద్దగా ఎవరికీ తెలియని పేరు. కానీ ఒక్కసారిగా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అయ్యారు. అంతేకాదు సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ గా కూడా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో అభివృధ్ధి ఏదీ జరగలేదని హాట్ కామెంట్స్ చేస్తున్న ఆమె రాజకీయమేంటన్నది అందరికీ ఆసక్తిని కలిగించే అంశం. ఆమె పేరుకు బీజేపీతో ఉన్నా కూడా వైసీపీ నేతలతో బాగా సంచయిత సాన్నిహిత్యం నెరపుతున్నారు.ఇక తనకు రాజకీయాలు అవసరం లేదని సంచయిత గజపతి రాజు అంటున్నారు. తాను పూసపాటి వారి వారసత్వాన్ని నిలబెట్టడానికే వచ్చాను చెబుతున్నారు. తాను చట్టబధ్ధమైన వారసురాలిని అని కూడా చెబుతున్నారు. తన బాబాయి అశోక్ గజపతి రాజు హయాంలో మాన్సాస్ ట్రస్ట్ లో ఏమీ అభివ్రుధ్ధి జరగలేదని, దాన్ని తాను స్వయంగా చేసి చూపించాలనుకుంటున్నాని సంచయిత చెబుతున్నారు. తాను బీజేపీకి విధేయురాలినే తప్ప మరే పార్టీకి దగ్గరగా లేనని వైసీపీలో చేరిక విషయంలో వస్తున్న ఆరోపణలు ఆమె గట్టిగా కొట్టేస్తున్నారు.అయితే ఇంత కచ్చితంగా చెబుతున్నా కూడా సంచయిత 2024 ఎన్నికల్లో పోటీ చేయదు అని చెప్పలేమని అంటున్నారు. ఆమె విజయనగరం అభివృధ్ధి గురించి తరచూ ప్రస్తావన చేయడం బాబాయ్ ని పొలిటికల్ గా సవాల్ చేయడమేనని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబుని, లోకేష్ ని సైతం విడవకుండా ట్వీట్లతోనే యుధ్ధం చేస్తున్నారు. ఒక మహిళ మాన్సాస్ ట్రస్ట్ తొలి చైర్ పర్సన్ అయితే ఎందుకు మీకు అంత బాధ అని కూడా సంచయిత బాబుకు గట్టిగా కౌంటర్లేస్తున్నారు. ఈ విధంగా ఆమె అటు వైసీపీ, ఇటు బీజేపీ దన్నుతోనే బలమైన బాబాయ్ రాజకీయ సామ్రాజ్యం మీద దాడి చేస్తున్నారని అంటున్నారు.సంచయిత మనసులో ఏముందో ఇప్పటికైతే బయటపెట్టడం లేదు కానీ 2024 ఎన్నికలో మాత్రం బాబాయ్ కి ఎదురునిలిచేది ఖాయమని అంటున్నారు. ఆమె వైసీపీకి తురుపు ముక్క అని కూడా చెబుతున్నారు. విజయనగరం రాజకీయాలను పూసపాటి వారిని విస్మరించి ఎవరూ ఇంతదాకా చేయలేదు. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా గజపతులను తమతో పాటే ఉంచుకుని పాలిటిక్స్ చేశారు. వైసీపీకి ఆ కొరత ఉంది. అశోక్ గజపతి టీడీపీ, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు కూడా టీడీపీ నుంచే 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2024లో కూడా సంచయిత బరిలోకి వస్తారు. అందువల్ల ఆమెను ఢీ కొట్టాలంటే ఈసారి కోలగట్ల వీరభద్రస్వామి ప్రయోగం సరిపోదని, అంతకు మించి అన్నట్లుగా సంచయితను పోటీకి పెట్టాలని వైసీపీ పెద్దలు గట్టిగా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అపుడే రాజుల మద్దతు పూర్తిగా దక్కుతుంది అన్న ఆశతో వైసీపీ ఉంది. చూడాలి మరి.