హైదరాబాద్ ఆగస్టు 24,
చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకైనా తాము సిద్ధంగానే ఉన్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. లడఖ్‌లో ఇటీవల పీఎల్ఏ దళాలు దురాక్రమణకు తెగించిన అంశంపై ఓ మీడియాతో స్పందిస్తూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండు దేశాల సైనిక అధికారులు, దౌత్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే అప్పుడు డ్రాగన్ దేశానికి సైన్యంతో బదులివ్వగలమన్నారు. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలన్నదే ప్రభుత్వ విధానం అని, అయినా రక్షణ దళాలు మాత్రం ఎటువంటి సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధంగా ఉంటాయని, ఎల్ఏసీ శాంతి కోసం ఇతర ప్రక్రియలు విఫలమైతే అప్పుడు సైనిక చర్య అనివార్యం అవుతుందని జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. లడఖ్‌లో శాంతి స్థాపన కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అధికారి అజిత్ దోవల్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు.