విశాఖపట్టణం ఆగష్టు 24
నగరంలో చారిత్రక నేపథ్యం కలిగిన తొట్లకొండను పరిరక్షించేందుకు బౌద్ధ సంఘాలు పోరుబాట పట్టాయి. వారి పోరాటానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపడుతూ కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బౌద్ధకాలంనాటి ఆనవాళ్లతో చారిత్రక నేపథ్యం ఉన్న తొట్లకొండ భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసిందని బౌద్ధ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ప్రభుత్వ అతిథి గృహాల కోసం కాపులుప్పాడులో కేటాయించిన 30 ఎకరాల స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. తొట్లకొండకు చెందిన 3,300 ఎకరాలను ప్రొటెక్టెడ్ ఏరియాగా నోటిఫై చేసిన తర్వాత దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొడెక్షన్ కమిటీ గుర్తు చేసింది.