ఏలూరు, ఆగస్టు 24
రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే గ్రామ వలంటీర్‌ను పోటీకి పెట్టి విజయం సాధిస్తామని తణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు ఎన్నికలకు దిగితే వలంటీరును మీపై పోటీకి దింపి గెలిపించే సత్తా మాకుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న మీరు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.కరోనా వైరస్‌కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటున్న మిమ్మల్ని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ. 8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో మీరు లేరని విమర్శించారు.అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్‌లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడమే కాకుండా, కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని ఎంపీ రఘురామ ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు