YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అధ్యక్ష బాధ్యతలకు ససేమిరా అంటున్న రాహుల్, ప్రియాంక..

 అధ్యక్ష బాధ్యతలకు ససేమిరా అంటున్న రాహుల్, ప్రియాంక..

న్యూఢిల్లీ, ఆగస్టు 24
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష సంక్షోభం ముదిరి పాకానపడింది. రాహుల్ రాజీనామా చేసి, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా.. పదవి నుంచి తప్పుకోడానికి సోనియా సిద్ధమవుతున్నారు.గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి సోనియా తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సమర్థమంతమైన, యువ నాయకత్వం కావాలంటూ ఏకంగా 23 మంది సీనియర్లు నేరుగా సోనియాకే లేఖ రాశారు. తిరిగి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని అన్యాపదేశంగా డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్‌లో అధ్యక్ష సంక్షోభం ముదిరి పాకానపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ సోమవారం జరుగుతోంది. అయితే, రాహుల్ గాంధీ మాత్రం పగ్గాలు చేపట్టడానికి ఏమాత్రం సిద్ధంగా లేరని సమాచారం. కాంగ్రెస్‌లోని ఓ వర్గం రాహుల్‌ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా... ఆయన ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పదవికి రాజీనామా చేసే సమయంలో ఎటువంటి వైఖరితో రాహుల్ ఉన్నారో... ఇప్పుడూ అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.అటు, ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఇదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతానని ఆమె కుండబద్దలు కొట్టారని సీనియర్లు పేర్కొన్నారు. ఇటీవల రాజస్థాన్‌‌లో ఏర్పడిన సంక్షోభానికి తనదైన శైలిలో పరిష్కారం చూపి చిక్కు ముడిని విప్పేసిన ప్రియాంక.. పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో వెనకడుగు వేస్తున్నారని సమాచారం.రాహుల్, ప్రియాంక ఏమాత్రం సుముఖంగా లేకపోవడం.. సోనియా ససేమిరా అనడంతో గాంధీ కుటుంబేతరులనే అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. అయితే ఈ పదవికి బాగా ప్రచారంలోకి వచ్చిన పేరు జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాకి అత్యంత సన్నిహితులైన ముకుల్ వాస్నిక్. కానీ... రాహుల్ కొత్తగా రెండు పేర్లు సూచించినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకె. ఆంటోనీ వీరిద్దరిలో ఎవరినో ఒకర్ని అధ్యక్ష బాధ్యతలకు ఒప్పించాలని సీనియర్లు రాహుల్ సూచించారు.
 

Related Posts