హైద్రాబాద్, ఆగస్టు 24
రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. కోర్టులో వంశీ చంద్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశించిన ఏపి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పిటిషనర్ వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఆ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది.తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్నిరోజులుగా జలవివాదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం విషయంలో పలు వివాదాలు నడుస్తున్నాయి. ఏపీలో శ్రీశైలం జలాశయానికి సమీపంలో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు కృష్ణా నీటి యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేసింది. అలాగే అపెక్స్ కౌన్సిల్‌కు కూడా లేఖ రాసింది.దీంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్‌కు హాజరు కావాలని తెలిపింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, విభజన చట్టంలో పొందుపరిచిందేనని ఏపీ తన వాదనను బలంగా వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. దీనిపై రూ.3320 కోట్ల టెండర్లను కూడా ఏపీ సర్కార్ పిలిచింది. మరోవైపు ఎత్తిపోతల పథకాన్ని ఎలా అయిన అడ్డుకోవాలని.. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ భావిస్తోంది