హైద్రాబాద్, ఆగస్టు 25,
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోందిఅన్‌లాక్ 4 దశలో దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలకు అనుమతినివ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరు లోపు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే.. పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతినిచ్చే అవకాశాలు కనిపించడం లేదు.బార్లు తెరిచేందుకు కూడా ఇప్పట్లో అనుమతిచ్చే పరిస్థితి లేదు. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మరికొన్ని రోజులు నిషేధం తప్పేలా లేదు. ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టనప్పటికీ రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయం.