YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హాట్ టాపిక్ గా మారిన రాంమాధవ్ కామెంట్స్

హాట్ టాపిక్ గా మారిన రాంమాధవ్ కామెంట్స్

విజయవాడ, ఆగస్టు 25, 
బీజేపీకి ఏం బలముంది ఏపీలో అని తెలుగుదేశం తమ్ముళ్ళు నిన్నటి వరకూ వేళాకోళం చేసేవారు. నిజానికి బీజేపీ బలం ఎపుడు ఏపీలో పరిమితమే. విభజన వల్ల తెలంగాణాలో పుంజుకోవచ్చు, ఏపీలో కొంత ఉనికి చాటుకోవచ్చు అని కమలం నేతలు అంచనా వేసుకున్నారు. దానికి తగినట్లుగానే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు, మరో రెండు ఎమ్మెల్సీ సీట్లతో కొంతవరకూ రాజకీయ ఉనికి సంపాదించుకున్నారు. చంద్రబాబుతో కలసి ఏపీ మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. నాలుగేళ్ల పాటు కాపురం చల్లగానే నడిచింది. చంద్రబాబు రాజకీయ ఎత్తుల వల్ల బీజేపీతో కటీఫ్ అన్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఏడాది పాటు లేని బీజేపీని ఏపీలో తిడుతూ చేయాల్సిన రచ్చ అంతా చేశారు. ఫలితంగా బీజేపీకి ఎక్కడో మండుకొచ్చింది. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత ఇపుడు తనదైన ప్రతీకార రాజకీయానికి కమలం పార్టీ దిగిపోయింది.ఏపీలో టీడీపీ ఉనికి ఉండకూడదు, ఇదీ బీజేపీ పంతం. పసుపు పార్టీని అంతం చేయడమే టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీకి తామే అసలైన ప్రతిపక్షమని కూడా గట్టిగా చాటుకుంటోంది. వినడానికి ఇది వింతగా ఉన్నా కూడా బీజేపీ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. నోటా కంటే తక్కువ ఓట్ల శాతం తెచ్చుకున్న బీజేపీ దాదాపుగా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న టీడీపీని మటాష్ చేస్తానని అనడం మామూలుగా అయితే ఎనిమిదవ వింత. అతి పెద్ద జోక్ కూడా. కానీ ఏపీలో రాజకీయ వాతావరణం, టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, బీజేపీకి కేంద్రంలో ఉన్న అపరిమితమైన బలం ఇవన్నీ కలసి బీజేపీ చేత ఈ మాటలు అనిపిస్తున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏమైనా చేయగలదు అన్న ధీమాను కూడా కలుగచేస్తున్నాయి.ఈ మాట కూడా వినడానికి నమ్మశక్యంగా లేదు. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పార్టీ నాయకులతో అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో మనకు ఎమ్మెల్యేలు రాబోతున్నారని. ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు పోటీ చేస్తే అన్ని చోట్లా డిపాజిట్ గల్లంతు అయింది. మొత్తం ఓట్లు తీసుకుంటే నోటా కంటే చాలా తక్కువ పడ్డాయి. మరి ఎలా ఎమ్మెల్యేలు పుట్టుకువస్తారు. అంటే టీడీపీ నుంచి జంపింగులు ప్రోత్సహించి అన్నమాట. మనం ఇపుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతున్నామని కూడా రాం మాధవ్ అంటున్నారు. అదెలా వీలవుతుంది అంటే టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెలేలలో 16 మందిని లాగేసుకుంటే వీలు అవుతుంది. అంటే చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది. అది బీజేపీకి వస్తుంది. నిజంగా ఈ మాటలు వింటే చంద్రబాబుకు వణుకు పుట్టదా. ఎలాగోలా చచ్చీ చెడి ప్రతిపక్ష హోదా దక్కింది. దాన్ని కూడా లాగేసుకుంటే ఇక టీడీపీ పని అయిపోయినట్లే కదా. రాం మాధవ్ తెలుగు వాడు. బీజేపీలో ఇపుడు మోడీ, అమిత్ షా తరువాత అంతటి వాడు. ఆయన తలచుకుంటే టీడీపీ ముక్క చెక్కలు కావడం ఏమంత కష్టం కాదు. అదే ఇపుడు బాబుకు పట్టుకున్న టెన్షన్.

Related Posts