ఏలూరు, ఆగస్టు 25,
ఏపీలో అధికార వైసీపీలో ఆసక్తికర విషయం చర్చకు వస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 40 మందికి సలహాదారులుగా పదవులు ఇచ్చారు. మరో 50 మంది నామినేటెడ్ పదవులు ఇచ్చారు.ఇక, నియోజకవర్గాల్లో ఇంచార్జులుగా కూడా పదవులు కట్టబెట్టారు. ఇక, మంత్రులుగా కూడా అవకాశం చాలా మందికి ఇచ్చారు. కానీ, వీరిలో ఎంతమంది.. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు ? ఎంతమంది పార్టీలో జగన్ కోసం త్యాగాలు చేసిన వారు ఉన్నారు. ఎంతమంది పాత కాపులకు ప్రాధాన్యం ఇచ్చారు.? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా.. జల్లాల వారీగా విభజించి చూసుకున్నా కూడా కొత్తవారికే జగన్ అవకాశాలు మెండుగా ఇస్తున్నారనే టాక్ మాత్రం జోరుగా వినిపిస్తున్నది. ఇది మంచి పరిణామం కూడా కాదని అంటున్నారు. పార్టీలో ఆది నుంచి ఉన్నవారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా జగన్ పార్టీ స్థాపించగానే ఆయన పార్టీలోకి జంప్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇక, కుట్రలో కుతంత్రాలతోనో జగన్.. జైలుకు వెళ్లినప్పుడు కూడా పార్టీ కోసం చెమటోడ్చిన వారు కూడా ఉన్నారు. 2010లో నాడు కాంగ్రెస్ ఎన్నో ఆఫర్లు ఇచ్చినా వదులుకుని మరీ 2012 ఉప ఎన్నికల్లో ఓడి పార్టీ కోసం ఎంతో కష్టపడిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు లాంటి నేతల నుంచి… రెండు సార్లు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ నుంచి… నాలుగుసార్లు గెలిచిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ లాంటి త్యాగధనుల లిస్ట్ చాలానే ఉంది.ఇక, 2014లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసిన వారు ఉన్నారు. ఇక జగన్ కోసం సీట్లు, పదవులు వదులుకుని త్యాగం చేసిన నాయకులు కూడా ఉన్నారు. మరి వీరిని కాదని జగన్ కొత్తవారిని అందలం ఎక్కించడం ఏంటి? పార్టీ కోసం కష్టించిన వారంతా ఏమవుతారనే ఆలోచన ఆయనకు లేదా? దీనిపైనే చర్చ సాగుతోంది. మంత్రుల్లో చాలా మంది పార్టీ తరఫున తొలిసారి గెలిచిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లోనూ వివిధ పార్టీ లనుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇక, సలహాదారులుగా పార్టీ ప్రస్థానంతో సంబంధం లేనివారు ఉన్నారు. ఇక, కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారు ఉంటే మరి కొందరికి అసలు ఏపీ రాజకీయాలతో సంబంధమే లేదు.మరికొందరు మంత్రులను మచ్చిక చేసుకుని పదవులు కొట్టేసిన వారు ఉన్నారు. ఇక, కొందరు కాంట్రాక్టుల కోసమో.. మరేదో కోసమో .. వచ్చి చక్రం తిప్పుతున్న వారు ఉన్నారు. మరీ విచిత్రంగా ఎన్నికలకు ముందు పార్టీ మారిన వారికి… ఎన్నికల్లో జగన్‌ను, వైసీపీని తిట్టి పార్టీ మారిన వారిని కూడా జగన్ అందలం ఎక్కించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఆది నుంచి ఉన్నవారు వగరుస్తున్నారు. జగన్ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో సహనం నసిస్తే.. ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చంద్రబాబు ఇలా చేసే.. అధికారం కోల్పోయారనే విషయం జగన్ గ్రహించాలనే సూచనలు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.