అమరావతి ఆగష్టు 25
ఇటీవల విజయవాడలోని క్వారంటైన్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మరవక ముందే సోమవారం రాత్రి విశాఖపట్నం మారికవలస గ్రామంలోని మరో క్వారంటైన్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మారికివలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మూడో అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరోనా రోగులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేంద్రంలో మొత్తం 64 మంది కరోనా రోగులు ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల విజయవాడలోని స్వర్ణప్యాలెస్ హోటల్లో రమేశ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.