కాకినాడ ఆగష్టు 25
మండపేట నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో తనకు ఆరోగ్యం పూర్తిగా బాగుపడినట్లు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి ఓ వీడియో విడుదల చేసి ఫోన్ లో తెలిపారు. తన ఆరోగ్యం కోసం మసీదులు, చర్చ్ లు, దేవాలయాలు వద్ద పూజలు చేసిన వారందరికీ జీవితాంతం రుణపడి వుంటానన్నారు. నియోజకవర్గం నుండే కాకుండా రాష్ట్రంనలుమూలల నుండి పలువురు వాట్సాప్ ల ద్వారా తన క్షేమాన్ని ఆకాంక్షించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రస్తుతం కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయినట్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల సూచనలు మేరకు ఒక వారం రోజులు హైదరాబాద్ లోనే ఉండాల్సి ఉందన్నారు. మూడు రోజులకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారన్నారు. పరీక్షలు అనంతరం త్వరలోనే మండపేట చేరుకుంటానని ఆయన తెలిపారు.