కడప ఆగష్టు 25
కడప నగరపాలక సంస్థ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి నివాసంలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నగరంలో పెండింగ్ పనులకు సంబంధించి ఆయా కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి పనులన్నీ పూర్తయ్యే టట్లు చూడాలన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలన్నారు.14 వ ఫైనాన్సు కమిషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇష్యూ చేయడం జరిగిందని ఈ పనులన్నీ త్వరగా పూర్తయ్యేటట్లు చూడాలన్నారు. నాడు - నేడు కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో మొదటి విడతగా 20 స్కూల్లను సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీ లోపల నాడు - నేడు పనులన్నీ పూర్తయ్యేటట్లు చూడాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా వీధులలో ఫాగింగ్ చేయాలన్నారు. నీటి కొళాయిలు, చేతిపంపుల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పట్టణంలో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ లవన్న, ఎస్ ఇ సత్యనారాయణ, ఈ ఇ లు ధనలక్ష్మి, భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.