న్యూ ఢిల్లీ ఆగష్టు 25
రష్యా విపక్ష నేత అలెక్సీ నవాల్నిపై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఆయన్ను చికిత్స నిమిత్తం జర్మనీ తరలించారు. అయితే నవాల్నిపై విషప్రయోగం జరిగిన విషయం వాస్తవమే అని జర్మనీ డాక్టర్లు తేల్చారు. క్లోనిస్టరేజ్ రసాయనాల వల్ల విషప్రయోగం జరిగినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. ఆ రసాయనం వల్ల నవాల్ని కోమాలోకి వెళ్లారు. బెర్లిన్ వర్సిటీ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స జరుగుతున్నది. విషప్రయోగం వల్ల ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయో చెప్పలేమన్నారు. నాడీవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు కచ్చితంగా ఉంటాయని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నా.. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు అయిన నవాల్నిపై కావాలనే విషప్రయోగం చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. మాస్కో నుంచి సైబీరియాకు విమానంలో వెళ్తున్న సమయంలో విషప్రయోగం జరిగింది.