YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, ఆగ‌స్టు 25 
 తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని  మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
 పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు , శ్రీమతి శారద దంపతులు  ఆలయానికి  మంగళవారం ఉదయం 12 పరదాలు  విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ  ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి, సూపరింటెండెంట్లు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీ  మధు, ఆలయ ఆర్చకులు పాల్గొన్నారు.
ఆగ‌స్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు...
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఆగ‌స్టు 30వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల ప్రభావాన్ని నివారించడానికి  ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగ‌స్టు 31వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 1న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 2న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కోవిడ్ - 19  వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా  ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Related Posts