YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్

జగన్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్

విజయవాడ, ఆగస్టు 25 
విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేష్ ఆస్పత్రి ఎండీ, చైర్మన్‌ రమేష్ బాబుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేష్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్‌పై స్టే విధించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ రమేష్ కుమార్‌తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ హోటల్లో ఏళ్ల తరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. స్వర్ణ ప్యాలస్ హోటల్‌లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఈ ప్రమాదానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా బాధ్యులేనని కోర్టు అభిప్రాయపడింది. వారు కూడా ఈ ప్రమాదానికి బాధ్యులే కదా అని ప్రశ్నించింది. దీంతో కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు.స్వర్ణప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన అక్కడ ఘోర అగ్నిప్రమాదం సంభవించగా 10 మంది మృతిచెందారు. అలాగే పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం రమేష్ ఆస్పత్రికి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతులు రద్దు చేసి ఎండీ డాక్టర్‌ రమేష్ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రమేష్ బాబు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారిపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ దుర్ఘటనకు రమేష్ ఆస్పత్రుల నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో రమేష్ బాబును ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఈ తరుణంలోనే మంగళవారం స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల చెక్కులు పంపిణీ చేసింది. ఇది జరిగిన కొద్ది సేపటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లంది.

Related Posts