అమరావతి ఆగష్టు 25
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.కాగా టీడీపీ నాయకుల తీరు కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.