విజయవాడ, ఆగస్టు 26,
సాధారణంగా రాజకీయాల్లో గతానికి.. ప్రస్తుతానికి మద్య పోలిక పెట్టడం అనేది ఎక్కడైనా ఉండేదే. అలా అనుకుంటే.. వ్యక్తులకు వ్యక్తులకు, నేతలకు నేతలకు కూడా పోలిక పెట్టడం రాజకీయాల్లో సర్వసాధారణం. సో.. ఇప్పుడు ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన పిన్నవయస్కుడు జగన్‌కు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించిన చంద్రబాబుకు మధ్య కూడా పోలికలు పెట్టడం సహజంగా జరిగేదే. అయితే, అన్ని విషయాల జోలికీ వెళ్లలేం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేబినెట్ల మధ్య ఉన్న పోలికను చూస్తే.. చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కేబినెట్‌లో నిజానికి ఇప్పుడున్న సమీకరణలు లేవు. ఇప్పుడు జగన్ ఇచ్చినన్ని పదవులు ఆయా సామాజిక వర్గాలకచంద్రబాబు ఇవ్వలేదు. కానీ, ఆయన కేబినెట్‌కు మంచి మార్కులు పడ్డాయి. దీనికి ప్రధాన కారణం స్ట్రాటజీ. వ్యూహాత్మకంగా ముందుకు సాగడం. మంత్రులుగా ఉన్నవారు తమదైన శైలిలో ముందుకు సాగడం. ఒకవైపు చంద్రబాబును అలరిస్తూనే.. ప్రజల్లో ఎక్కువ కాలం గడిపేవారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఇక, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెచ్చించారు. తమకంటూ.. ప్రత్యేక స్టేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చంద్రబాబు కేబినెట్‌కు మంచి మార్కులు పడ్డాయి.చంద్రబాబు కేబినెట్లో ఉన్నవారంతా రాజకీయంగా తలపండిన వారు… ఏ టైంలో ఎక్కడ స్వరం పెంచాలో… ఎక్కడ తగ్గాలు తెలిసిన నేతలు కూడా. ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా తమ వద్దకు నిధుల కోసం వస్తే వారికి కావాల్సిన నిధులు ఇవ్వడమో లేదా తగ్గించి ఇవ్వడమో చేసేవారు. కొన్నిసార్లు చేసిన పని కన్నా బయట మీడియాలో తాము ఎక్కువ చేస్తున్నట్టు చెప్పుకునేందుకు కూడా పోటీ పడేవారు. ఇక, జగన్ కేబినెట్ విషయానికి వస్తే.. అన్ని సామాజిక వర్గాలకు దాదాపు ప్రాథాన్యం ఇచ్చారు సీఎం జగన్. ఎవరూ ఊహించని విధంగా ఐదుగురు ఎస్సీ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి మహిళకు అది కూడా గిరిజన వర్గానికి చెందిన ఆమెకు ఇచ్చారు. ఇంత చేసినా.. ఆయన కేబినెట్‌కు మాత్రం మార్కులు పడడం లేదు.దీనికి ప్రధాన కారణం.. జగన్ కేబినెట్లో ఉన్న మంత్రులు అందరికి దూసుకుపోయే తత్వం లేక పోవడమే. ఏం చేస్తే.. ఏమవుతుందో.. అనే ఆందోళనతో పాటు జగన్ పెట్టిన డెడ్‌లైన్ కూడా వారికి ప్రతిబంధకంగా మారింది. వివాదం అయితే.. రెండున్నరేళ్ల తర్వాత (ఇప్పటికే ఏడాదిన్నర అవుతోంది) తమకు పదవులు ఉంటాయో ఊడతాయోనని భయపడుతున్నారు. దీంతో కొడాలి నాని, పెద్దిరెడ్డి, బొత్స వంటి ఒకరిద్దరు నాయకుల హవానే కనిపిస్తోంది తప్ప.. కేబినెట్లో అందరి పాత్ర పాలనలో కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇలా అయితే.. ప్రజల్లో మార్కులు ఎలా పడతాయి?