YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీకి వ్రతం చెడ్డా.. ఫలితం రాలేదా

వంశీకి వ్రతం చెడ్డా.. ఫలితం రాలేదా

విజయవాడ, ఆగస్టు 26, 
ఎవరైనా పార్టీ మరితే ఏం ఆశిస్తారు. తాను అడిగిన డిమాండ్లను అన్నీ పూర్తి కావాలనుకుంటారు. తాను నియోజకవర్గంలో కింగ్ లాగానే ఉండాలనుకుంటారు. అందుకే దశాబ్దకాలం నుంచి తనకు అండగా నిలిచిన పార్టీని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వదిలి వచ్చేశారు. వైసీపీ కండువా కప్పుకుని వల్లభనేని వంశీ దాదాపు ఎనిమిది నెలలు పైగానే అవుతుంది. అయితే ఆయన చేరిక సమయంలో ఇచ్చిన హామీలు ఇంతవరకూ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన వర్గీయులే బాహాటంగా చెబుతున్నారు.వల్లభనేని వంశీ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వల్లనే ఎమ్మెల్యే అయ్యారు. జగన్ హవాలో సయితం తక్కువ మెజారిటీతోనైనా వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా గట్టెక్కగలిగారు. ఈ గెలుపులో వల్లభనేని వంశీ వ్యక్తిగత ఇమేజ్ ఎంతో కొంత ఉన్నా, మెజారిటీ శాతం గెలుపునకు ఉపయోగపడింది పార్టీయేనని చెప్పక తప్పదు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన తొలుత బీజేపీలోకి వెళ్లాలని భావించి సుజనా చౌదరితోనూ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎందుకో ఆ ఆలోచనను విరమించుకుని వైసీపీ కి అనధికార ఎమ్మెల్యేగా మారిపోయారు.ఎనిమిది నెలల క్రిత మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలతో కలసి జగన్ ను వల్లభనేని కలసి మద్దతు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ జగన్ ను కలిసే అవకాశమే రాలేదు. చంద్రబాబు పై ఎలాంటి ఆరోపణలు వల్లభనేని వంశీ చేశారో అదే పరిస్థితి వైసీపీలోనూ ఆయనకు ఎదురవుతోంది. చంద్రబాబు అధికారంలో ఉండగా పార్టీ నేతలను పట్టించుకోలేదని, అధికారులకే ప్రయారిటీ ఇచ్చారని వల్లభనేని వంశీ పార్టీ మారిన తర్వాత విమర్శించిన సంగతి తెలిసిందే.ఇక పార్టీ మారినా మనశ్శాంతి లేకుండా వల్లభనేని వంశీ గడుపుతున్నారు. గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావును తప్పించి డీసీఎంస్ ఛైర్మన్ గా పంపినా, దుట్టా రామచంద్రరావు రాకతో వల్లభనేని వంశీ చికాకులు ఎదుర్కొంటున్నారు. తానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థినని దుట్టా ప్రకటించుకున్నారు. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి పార్టీ మారి వల్లభనేని వంశీ బావుకున్నదేమిటో అర్థం కావడం లేదంటున్నారు ఆయన అనుచరులు.

Related Posts