YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ సారి ఎన్నికలు నల్లేరుపై నడకేనా

ఈ సారి ఎన్నికలు నల్లేరుపై నడకేనా

హైద్రాబాద్, ఆగస్టు 26, 
తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నిక మరోసారి అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. గెలుపోటములను పక్కన పెడితే ఈ ఎన్నికల్లో అసలు పోటీ ఉండదని అధికార టీఆర్ఎస్ పార్టీ తొలుత భావించింది. అయితే తమ అభ్యర్థులు ఉంటారని విపక్షాలు ప్రకటించడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దుబ్బాకలో ఆరు నెలల్లో ఎన్నిక జరగాల్సి ఉంది.అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక కావడంతో రామలింగారెడ్డి కుటుంబం నుంచే ఎవరో ఒకరిని బరిలోకి దింపే అవకాశముంది. రామలింగారెడ్డి సతీమణి కాని, ఆయన కుమారుడికి కాని అధికార టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అందువల్ల ఆ కుటుంబానికి తప్పించి వేరే వారికి ఇచ్చే ఆలోచన టీఆర్ఎస్ చేయదు.ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ తాము దుబ్బాక ఉప ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ ఖాయమయింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తమ అభ్యర్థి దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలింది. ఎమ్మెల్యే మరణంతో ఏకగ్రీవం అవుతుందనుకుంటున్న ఎన్నికకు పోటీ తప్పదని తేలిపోయింది.అయితే దుబ్బాక నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇప్పటి వరకూ ఇక్కడ 1983లోనే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. చెరుకు ముత్యం రెడ్డి టీడీపీ తరుపున మూడు సార్లు విజయం సాధించారు. 2004లో తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఇక్కడ గెలిచారు. 2009లో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ముత్యంరెడ్డి కూడా చివరలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయన కూడా మరణించారు. దీంతో ఇక్కడ పోటీ చేసి గెలవడం కాంగ్రెస్, బీజేపీలకు అంత సులువుకాదు. కొంతకాలం జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఎన్నిక అనివార్యమైనా కాంగ్రెస్ కు విజయం సాధించడం అంత సులువు కాదు.

Related Posts