YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ప్రభుత్వ ద్యేయం - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ప్రభుత్వ ద్యేయం - మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్

నల్గోండ ఆగస్టు 26 
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు  ఎమ్మెల్యే  నోముల నర్సింహయ్య తో కలిసి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే కులవృత్తులను ప్రోత్సహించేందుకు  దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీపై వాహనాలు కూడా మత్స్యకారులకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా పాల ఉత్పత్తి ని పెంచేందుకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ద్వారా మేలుజాతి పశుసంపద అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా గొల్ల కురుమ లకు గొర్రెలను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని అన్నారు. ఇవే కాకుండా నేత, గీత రజక ఇలా అన్ని కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. ఉద్యమనాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు 70 సంవత్సరాల గోస నుండి విముక్తి లభించిందన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం ఆలోచించని అంత గొప్పగా ముఖ్యమంత్రి ఆలోచనలు ఉంటాయని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఆశయంతో రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రైతులు పండించిన  పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఏ నాడు ప్రజలు, రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించలేదని, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చేవారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు లేనిపోని ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Related Posts