ముంబై, ఆగస్టు 27,
నోట్ల రద్దు తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన 2000ల రూపాయల నోటును నిలిపేస్తున్నారా? ఆర్బీఐ చేసిన ప్రకటన సరికొత్త సందేహానికి తావిచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 నోట్లను ఒక్కటి కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. 2018 నుంచి చెలామణిలో ఉన్న ఆ నోట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందని వివరించింది.2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల రెండు వేల నోట్లు వాడకంలో ఉండగా.. 2019 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 32,910 లక్షలకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. 2020 మార్చి చివరికి నాటికి ఆ సంఖ్య 27,398 లక్షలకు తగ్గిందని బ్యాంకు తన వార్షిక నివేదికలో వివరించింది.2020 మార్చి నెల చివరికల్లా మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2000 నోట్ల పరిమాణం 2.4 శాతంగా ఉందని తెలిపింది. 2019, 2018 మార్చి చివరి నాటికి అది వరసగా 3 శాతం, 3.3 శాతంగా ఉందని వివరించింది. విలువపరంగా చూసినా.. 2018 నుంచి 2020కి 37.3 శాతం నుంచి 22.6 శాతానికి పడిపోయింది.మరోవైపు.. రూ.500, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్ల విలువ, పరిమాణం పరంగా చెలామణి పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. గత కొంత కాలంగా మార్కెట్లోకి ఈ నోట్లను పెద్ద మొత్తంలో విడుదల చేసినట్లు వివరించింది. ఫలితంగా వీటి సర్క్యులేషన్ గణనీయంగా పెరిగిందని నివేదికలో పేర్కొంది.నోట్ల సరఫరాపై కరోనా లాక్‌డౌన్ తీవ్రంగా ప్రభావం చూపిందని ఆర్బీఐ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 2019-20 సంవత్సరంలో నోట్ల సరఫరా 23.3 శాతం తగ్గిపోయిందని పేర్కొంది. ఇదే సమయంలో నకిలీ నోట్ల సంఖ్య కూడా పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.ఆర్బీఐ ప్రకటనతో రూ.2000 నోట్లను రద్దు చేస్తారేమోనని కొంత మంది ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ అంశంపై ఆర్బీఐ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మార్కెట్లో చెలామణిలో ఉన్న 2000 నోట్ల సర్క్యులేషన్‌ను తగ్గిస్తున్నట్లు మాత్రమే తెలిపింది.