కొలంబో, ఆగస్టు 27,
భూటాన్ మినహా భారత పొరుగు దేశాలను తన వైపు తిప్పుకుంటోన్న చైనా... మన చుట్టూ మెల్లగా ఉచ్చు బిగిస్తోంది. ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపి డ్రాగన్.. మన మిత్ర దేశాలను సైతం తన వైపు లాగేసుకుంటోంది. కానీ ఇప్పుడిప్పుడే చైనా అసలు స్వరూపం తెలుసుకుంటున్న ఈ దేశాలు డ్రాగన్ పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. భారత్‌కు అత్యంత మిత్ర దేశాల్లో ఒకటైన శ్రీలంక కొన్నాళ్ల క్రితం ఇదే తరహాలో చైనా గూటికి చేరింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజపక్సే సోదరులు ఘన విజయం సాధించారు. మహీంద రాజపక్సే గతంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీకి చేరువయ్యారు. శ్రీలంక కొత్త ప్రభుత్వం భారత్‌కు భరోసానిచ్చేలా కీలక వ్యాఖ్యలు చేసింది.భారత్‌కే తొలి ప్రాధాన్యమిచ్చేలా నూతన విదేశాంగ విధానాన్ని తాము ఆచరిస్తామని శ్రీలంక విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జయంత్ కొలంబగే స్పష్టం చేశారు. భారత వ్యూహాత్మక భద్రతా ప్రయోనాలకు హాని కలిగించేలా తమ దేశం ఏ పని చేయబోదన్నారు. చైనాతో హంబన్‌టోట ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఆయన ఓ తప్పిదంగా అభివర్ణించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వాడుకోనీయబోమన్నారు.గతంలో అడ్మిరల్‌గా పని చేసిన కొలంబగేను నూతన ఫారిన్ సెక్రటరీగా అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నియమించారు. సైనిక నేపథ్యం ఉన్న తొలి శ్రీలంక తొలి ఫారిన్ సెక్రటరీ జయంత్ కొలంబగే కావడం గమనార్హం. చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా.. భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా 2018లో భారత్ నిలిచింది. రెండు దేశాలూ ఆర్థిక దిగ్గజాలేనని కొలంబగే తెలిపారు.హంబన్‌టోల పోర్టు ప్రాజెక్టును ముందుగా భారత్‌కు ఆఫర్ చేశామని.. కానీ న్యూఢిల్లీ చేపట్టకపోవడంతో అది చైనా కంపెనీకి వెళ్లిందన్నారు. 2017లో 99 ఏళ్ల లీజ్‌కు శ్రీలంక హంబన్‌టోట పోర్టును చైనాకు అప్పగించింది.