తిరుపతి, ఆగస్టు 27,
చిత్తూరు జిల్లాలో భారీ దోపిడీ ఘటన వెలుగుచూసింది. సుమారు రూ.6 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను దొంగల ముఠా సినిమా స్టైల్లో దోచుకెళ్లడం తీవ్రకలకలం రేపుతోంది. కంటైనర్ లారీలో తరలిస్తున్న షావోమీ ఫోన్లను దోపిడీ ముఠా దోచుకెళ్లడం సంచలనం కలిగించింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబూరు ఎంఐ గోడౌన్ నుంచి సెల్‌ఫోన్లతో బయల్దేరిన వాహనాన్ని వెంబడించిన దుండగులు ఏపీ బోర్డర్ దాటాక దోపిడీకి పాల్పడ్డారు.బోర్డర్ దాటిన తర్వాత కంటైనర్ లారీని మరో లారీతో గుద్దించి నిలిపివేశారు. డ్రైవర్ తలకి తుపాకీ పెట్టి చేతులు కాళ్లు కట్టేసి ఏకంగా లారీని ఎత్తుకెళ్లారు. డ్రైవర్‌ని చితకబాది పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. లారీని సుమారు 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నగరి సమీపంలో వదిలేశారు. కంటైనర్‌లోని రూ.6 కోట్ల విలువ చేసే సెల్‌ఫోన్ బాక్సులను దోపిడీ చేశారు. నగరి సమీపంలో లారీని రోడ్డు పక్కన నిలిపి మరో లారీలోకి బాక్సులు లోడ్ చేసుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతపెద్ద మొత్తంలో సెల్‌ఫోన్లు చోరీ చేయడం సంచలనంగా మారింది. తుపాకీ గురిపెట్టి సినిమా స్టైల్లో దోపిడీకి పాల్పడిన ముఠాని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ముఠాగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.