ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం బంద్ నిర్వహించింది. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వచ్చిందని, 65 లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దుకాణాల మూత వల్ల ఈ రోజు చాలా మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. రాష్ట్రానికి ఎంత నష్టమో విపక్షాలు ఆలోచించాలని, రాష్ట్రానికి నష్టం చేకూర్చకూడదని అన్నారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో గతంలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామని, ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలపాలని, సైకిల్ యాత్ర ప్రజల్లో కదలిక తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.మరో పక్క చంద్రబాబు బంద్ పై, కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సీఎం మాట్లాడుతూ ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఉద్యమసంస్థలు ఆలోచించాలన్నారు. తమని తాము శిక్షించుకోరాదని.. అన్యాయం చేసిన వారిని శిక్షించాలని సూచించారు. తాము చేపట్టే నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. అరగంట సేపు నిరసనలో పాల్గొని...మరో గంటసేపు అదనంగా పని చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో టీడీపీ మినహా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైసీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.