విశాఖపట్టణం, ఆగస్టు 27,
ముఖ్యమంత్రి జగన్ కి ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి విశాఖ క్యాపిటల్ సిటీ కాబోతున్న నేపధ్యంలో మరింత ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా కూడా ఉన్నారు. దాంతో పాటు విశాఖ రాజధాని నగరంలో కబ్జాలు చోటు చేసుకోకుండా చూసే కీలక బాధ్యత కూడా జగన్ ఆయనకే అప్పగించారు. అయితే రోజు విడిచి రోజు విశాఖలో ఎక్కడో ఒక చోటా భూ కబ్జా కేసులు నమోదు అవుతున్నాయి. అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారంతా ప్రభుత్వ పెద్దల పేర్లనే వాడుకుంటున్నారు.ఇక విజయసాయిరెడ్డి ఈ పరిణామాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా ఆయన పేరు వాడేసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యనే విశాఖ నడిబొడ్డున ఒక అతి విలువైన స్థలం కబ్జా చేసేందుకు ఓ ముఠా ప్రయత్నం చేసింది. వారు సిటీలో అర్ధరాత్రి నుంచి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, స్థానికులకు హెచ్చరికలు జారీ చేస్తూ తమ వెనక ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెప్పుకోవడం విశేషం. దీని మీద వెంటనే రియాక్ట్ అయిన విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన పేరు ఎవరు చెప్పినా ఊచలు లెక్కించాలని కూడా గట్టిగానే కోరారు.ఇక విజయసాయిరెడ్డి ఆఫీస్ లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి కూడా ఆయన పేరు ఉపయోగించుకుని అవినీతికి పాల్పడడం విశేషం. ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో ఎంపీ నుంచి లేఖను వచ్చేలా చూస్తానని ఆమె సంబంధిత పార్టీతో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేసిన వైనం బయటకు పొక్కడంతో సాయిరెడ్డి మరింత ఇరకాటంలో పడ్డారు. దాని మీద కూడా ఆయన సీరియస్ అయ్యారు. యాక్షన్ కి రెడీ అయ్యారు. ఇంతకు ముందు కూడా విజయసాయిరెడ్డి ఆఫీస్ సిబ్బంది నిర్వాకం మూలంగానే ఆయన సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టింగులతో ఇబ్బంది పడ్డారు. అలాగే మరి సొంత పార్టీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి కూడా విజయసాయిరెడ్డి పేరు చెప్పే భూ కబ్జాకు యత్నం చేయడం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిపోయింది. తన పేరు ఉపయోగించుకోవద్దు, కఠిన చర్యలు ఉంటాయని పెద్దాయన ఎంత చెబుతున్నా కూడా పార్టీలో నేతలు వినడంలేదు, దాంతో విజయసాయిరెడ్డి చాలా తలనొప్పులు భరించాల్సివస్తోంది మరో వైపు పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.దీని మీద మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగని అరచినట్లుగా ఉందని విజయసాయిరెడ్డి మీద సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే విశాఖలో భూ దందాలు జరుగుతున్నాయని, కానీ ఆయన ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతా ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖకు అడ్డ పంచెల వాళ్ళు వచ్చి కబ్జా చేస్తారని తాము ముంచు నుంచి చెబుతున్నామని, అదే ఇపుడు కూడా జరుగుతోందని కూడా మాజీ మంత్రి అంటున్నారు. మొత్తానికి వైసీపీలో చిన్నా చితకా నాయకుల భూ దందాల మూలంగా పార్టీ పరువు పోతోంది, విజయసాయిరెడ్డి కూడా అడ్డంగా దొరికిపోతున్నారు. మరి జగన్ సన్నిహితుడికే ఇన్ని అగచాట్లు పెడుతున్న పార్టీలోని కొందరు నేతల వైఖరి పైన జగన్ ఎలా స్పందిస్తారో ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి.