హైదరాబాద్ ఆగస్టు 27
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లను హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన 5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్‌లో జమ చేసి వాడుకుంటోందన్నారు. సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలనడం సరి కాదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన 2700 కోట్లను త్వరగా విడుదల చేయాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఐ.జీఎస్టీ సమావేశం వెంటనే నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హాజరయ్యారు.