హైద్రాబాద్, ఆగస్టు 27
ఆన్‌లైన్ తరగతులు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్‌లైన్ తరగతులపై విధి విధానాలు ఖరారు చేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. టీ శాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ క్రమంలో కోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది. టీవీ ద్వారా వీడియో పాఠాలు చెబితే విద్యార్థులకు అనుమానాలు వస్తే ఎలా నివృత్తి చేసుకుంటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సందేహాలు నివృత్తి చేసేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఒకేసారి టీవీ పాఠాలు ఎలా వింటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1 నుంచి 10వ తరగతి వరకు వేర్వేరు సమయాల్లో పాఠాలు ప్రసారమవుతాయని ప్రభుత్వం హైకోర్టు తెలిపింది.అయితే, ఆన్ లైన్ తరగతులకు హాజరు తీసుకోలేమని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేర్వేరు సమస్యలున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులపైనే మా ఆందోళన అంతా అని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ విధి విధానాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ రద్దు చేస్తున్నారని హెచ్ఎస్ పీఏ తరఫు న్యాయవాది తెలిపారు. ఫీజులకు సంబంధించి ఇప్పటికే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.అయితే, ఆ జీవో ఉల్లంఘించిన విద్యాసంస్థలపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చామని, గుర్తింపు రద్దు ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. జీవో ఉల్లంఘించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.దీనిపై బోయిన్‌పల్లి పీఎస్‌లో తల్లిదండ్రులపై కేసులు పెట్టారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులపై ఏ కారణంతో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైనందున మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలని బాలల హక్కుల సంఘం కోరగా.. ప్రతి ఇంటికి మధ్యాహ్న భోజనం చేర్చడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయ పడింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18 వాయిదా వేసింది.